సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్ (Collector Prateek Jain), ఇతర ప్రభుత్వ అధికారులపై పై దాడి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై రైతులతో చర్చించేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులు సోమవారం లగచర్ల గ్రామం వెళ్లారు.
ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ఆ గ్రామాల ప్రజలు అధికారులను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయారు. ఫార్మా కంపెనీ పెట్టేందుకు వీల్లేదంటూ తిరగబడ్డారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్థుల అభిప్రాయ సేకరణ కు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ (Collector Prateek Jain), ఇతర అధికారుల వాహనాలపై రైతులు రాళ్లతో దాడి చేశారు. ఓ మహిళ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై చేయి చేసుకుంది. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపైనా గ్రామస్థులు దాడి చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. కాగా, ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి.