ఎన్నికల ప్రక్రియకు కావాల్సిన సౌకర్యాలను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ఐడిఓసి లోని కలెక్టర్ సమావేశం మందిరంలో ఎన్నికల కార్యకలాపాలను ముందస్తుగా అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో డోర్నకల్, మహబూబాబాద్ నియోజక వర్గాలలో 531 పోలింగ్ కేంద్రాలున్నాయని, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాల్లోని నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడ, గంగారాం, గార్ల, బయ్యారం, పెద్దవంగర, తొర్రుర్ మండలాలలోని పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తంగా జిల్లాలో 764 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.
పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహణకు కావల్సిన వసతుల కల్పన అంశాలను ప్రస్తావిస్తూ ర్యాంప్ లు, త్రాగునీరు, మరుగుదొడ్లు, సామాగ్రి ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలలో ఉపయోగించే వాహనాలను సమకూర్చాలని ఆర్టీఓ రమేష్ రాథోడ్ కు సూచించారు. రిసెప్షన్, కలెక్టింగ్ కేంద్రాలను కూడా సందర్శించాలన్నారు.
స్వీప్ కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. సోషల్ మీడియాకు సిబ్బందికి విధులు కేటాయించాలన్నారు. ఎన్నికల విధులకు కావాల్సిన సిబ్బంది నివేదిక రూపొందించాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్, పి.డబ్ల్యుడి ఓటర్లు, సర్వీస్ ఓటర్ల నివేదిక ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జడ్పి సి.ఈ.ఓ. రమాదేవి, డి.ఆర్.డి.ఓ.సన్యాసయ్య, డి.ఈ.ఓ.రామారావు, స్వీప్ నోడల్ అధికారి సూర్యనారాయణ, సహకార శాఖ అధికారి ఖుర్షీద్, పంచాయతీ అధికారి నర్మద, మార్కెటింగ్ అధికారి వేక్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Collector Sasanka: ఎన్నికల ప్రక్రియకు ముందస్తు ఏర్పాట్లు
ఎన్నికల నిర్వహణకు సకల ఏర్పాట్లు చేయాలి