Telangana : ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై తెలంగాణ ప్రభుత్వం, వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాల మధ్య నెలకొన్న వివాదం సుఖాంతమైంది. ప్రభుత్వ హామీతో తమ సమ్మెను విరమిస్తున్నట్లు కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో మంగళవారం నుంచి వృత్తి విద్యా కళాశాలల్లో తరగతులు యథాతథంగా కొనసాగనున్నాయి. విద్యార్థులకు ఊరట లభించింది.
ఈ సమస్య పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి కళాశాలల యాజమాన్యాలతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1200 కోట్లను దీపావళిలోగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రూ.600 కోట్ల టోకెన్ల బకాయిలను ఈ వారంలోనే చెల్లిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.
గత భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పదేళ్లుగా నిధులు పెండింగ్‌లో పెట్టి విద్యారంగాన్ని ఛిన్నాభిన్నం చేసిందని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సృష్టించిన ఈ సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా, ఫీజు రియింబర్స్‌మెంట్ విధానాన్ని క్రమబద్ధీకరించడానికి (రేషనలైజేషన్) ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బంద్ విరమించుకున్న కళాశాలల యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిష్కారంతో వేలాది మంది విద్యార్థుల చదువులకు ఆటంకం తొలగింది.


