మన దైనందిన జీవితంలో గ్యాస్ సిలిండర్ అవసరం భారీగా పెరిగింది. ప్రస్తుతం దేశంలోని దాదాపు ప్రతి ఇంట్లోనూ గ్యాస్ వినియోగిస్తున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా గ్యాస్ వినియోగదారులకు ఊరట కలిగే వార్త వచ్చింది. వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియడంతో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.41 తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి.
ఈ మార్పు మంగళవారం నుంచి అమలులోకి వస్తుంది. తాజా ధరల ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ రిటైల్ ధర రూ.1762కి చేరింది. ఇదే ధర ఇతర మెట్రో నగరాల్లో కూడా స్వల్ప వ్యత్యాసంతో ఉండొచ్చు. గతంలో ఫిబ్రవరి 1న కమర్షియల్ ఎల్పీజీ ధరలను రూ.7 తగ్గించగా, అంతకుముందు డిసెంబర్‌లో రూ.62 పెంచారు. ప్రస్తుతం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం చిన్న వ్యాపారాలు, హోటళ్లకు కొంత ఉపశమనంగా మారనుంది. రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య రంగాలు ఎల్పీజీపై అధికంగా ఆధారపడటం వల్ల ఈ ధర తగ్గుదల కొంత ప్రయోజనం చేకూర్చే అవకాశముంది.
ఇక గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు జరగలేదు. ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా చమురు సంస్థలు ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా ఎల్పీజీ ధరలు మారుతూ ఉంటాయి. తాజా తగ్గుదల వ్యాపార రంగానికి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచిచూడాల్సి ఉంది.