త్వరలో తెలంగాణ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయగా.. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతరవకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. తమ పరిశీలనలో నాలుగు పేర్లు ఉన్నాయని చెప్పారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్‌రెడ్డి పేరు చాలా మంది చెప్పారని తెలిపారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని స్పష్టంచేశారు.
ఈ నెలాఖరుకు పార్టీలో అన్ని కమిటీల పదవులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. కమిటీలలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. జనవరి చివరి వారంలో కార్పొరేషన్ పదవులను చేపడతామని తెలిపారు. ఇక ఫార్ములా ఈ రేస్ వ్యవహారంతో పాటు మాజీ సీఎం కేసీఆర్‌ను పొగుడుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.