తెలంగాణ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా పరిస్థితి తయారైంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘ఏసీబీ ఆఫీసులో పదేళ్లుగా ఓ నల్ల బ్యాగు పడి ఉంది. ఎవరిదో చెప్పుకోండి’ అంటూ పోస్ట్ చేసింది. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావన వచ్చేలా పరోక్షంగా చేసిన ఈ ట్వీట్‌కు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
‘ఆ బ్యాగును చూసి కేటీఆర్ తెల్లమొహం వేశాడా.. ఆ బ్యాగులోనే 2014 నుంచి మీరు చేసిన అవినీతి చిట్టా ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ స్కాం, ఔటర్ రింగు రోడ్డు దోపిడీ, కాళేశ్వరం స్కాం, అక్రమ ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు, ప్రభుత్వ భూముల అక్రమ అమ్మకాలు, కవిత లిక్కర్ స్కాం, ధరణి పోర్టల్‌తో చేసిన భూ దోపిడీ, స్కీంల పేరుతో చేసిన స్కాంలు, గొర్రెల స్కాం, సర్పంచ్‌లకు ఎగ్గొట్టిన బిల్లులు, మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పుల వివరాలు, దళితులపై మీ దౌర్జన్యాలు.. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. మీ బీఆర్ఎస్ దోపిడీ దొంగల అవినీతి వివరాలను నింపడానికి ఆ ఒక్క బ్యాగు సరిపోదు, ఇంకా చాలా బ్యాగులను నింపాల్సి ఉంది. కేటీఆర్ విచారణకు వెళ్ళిన ప్రతిసారి బ్యాగులను లెక్కించమని చెప్పండి’’ అంటూ పోస్ట్ చేసింది.