రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్‌షా (Amit shah) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలూ నిరసన కార్యక్రమం చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కాంగ్రెస్ ముఖ్యనేతలు కొప్పుల రాజు, అనిల్ కుమార్ యాదవ్, వీహెచ్, రోహిన్‌రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు
ఈ సందర్భంగా హహేశ్ కుమార్ మాట్లాడుతూ..అంబేడ్కర్ పేరు లక్షలు, కోట్ల సారైనా నిత్యం స్మరిస్తూనే ఉంటామని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మనుస్మృతి అమలు చేసేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తక్షణమే అమిత్‌షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమిత్‌షాపై చర్యలు తీసుకునేంత వరకూ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని వెల్లడించారు. అంబేద్కర్ పేరు బీజేపీ నేతలకు ఫ్యాషన్ అయితే తమకు మాత్రం ఆరాధ్య దైవమన్నారు. బీజేపీ తీరును ప్రజాస్వామ్య రీతిలో ఎండగడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై కేసు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు.