ఎల్కతుర్తి సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌నే విలన్ లా చూపించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియా గాంధీకి అప్పట్లో కాళ్లు మొక్కిన విషయం మర్చిపోయావా కేసీఆర్.. అంటూ పొంగులేటి నిలదీశారు.
బీఆర్ఎస్‌కు రెండుసారి ప్రజలు అధికారం ఇచ్చినా, అందుకు తగిన విధంగా పాలన జరగలేదని ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారని అన్నారు. కేసీఆర్ అనుభవంతో మంచి సలహాలు ఇస్తారనుకున్నాం. కానీ అసెంబ్లీకి కూడా రాలేకపోయారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సచివాలయానికి రాలేదని తెలిపారు. ఫాంహౌజ్ పాలన నడిపారు అని విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ కాంగ్రెస్‌పై ఉద్దేశపూర్వకంగా విషం చిమ్మారని మండిపడ్డ పొంగులేటి, కాంట్రాక్టర్ల బకాయిల విషయంలోనూ బీఆర్ఎస్ హయాంలో తీవ్ర అన్యాయమైందన్నారు. BRS హయాంలో కాంట్రాక్టర్లకు 80 వేల కోట్ల బకాయిలు పెండింగ్. సర్పంచుల బిల్లులు కూడా చెల్లించకుండా మోసం చేశారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ అయినా.. 1500 కోట్ల రూపాయల పార్టీ ఫండింగ్ ఎలా వచ్చిందని నిలదీశారు. అధికారం కోసమే కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం సభకు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవరోధాలు సృష్టించిందని, ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం ఉందని.. కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక రహస్యంగానే మొగుడు–భార్య సంభాషణలు విన్న స్థాయికి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.