కాంగ్రెస్ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మాట్లాడుతూ.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉండి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. స్థానిక సంస్థల్లో అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో అభ్యర్థుల కోసం కేసీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన దిక్కుతోచక మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ కుమార్తె కవితపై ఇప్పుడు మరో లిక్కర్ స్కాం ఆరోపణలు రావడంతో ఆ అంశాన్ని పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదన్నారు.
ఇక ఎంపీ మల్లు రవి(Mallu Ravi)స్పందిస్తూ.. సోషల్ మీడియాలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పని చేస్తున్నారని తెలిపారు. గ్రౌండ్ లెవల్లో ఆ పార్టీకి క్యాడర్ లేదని విమర్శించారు. తమ పార్టీ పెట్టిన పోస్టుకు బీఆర్ఎస్ నేతలే ఓట్లేసి ఈవిధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాయన్నారు. బీఆర్ఎస్ నేతలు పార్టీ మారకుండా ఉండేందుకు కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మల్లు రవి వ్యాఖ్యానించారు.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత అద్ధంకి దయాకర్(Addanki Dayakar)స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం వైఫల్యం చెంది ప్రజలు సమస్యల్లో ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా..ఫామ్ హౌజ్‌లో ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు. తాము కూడా కేసీఆర్ బయటకురావాలనే చూస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని భరించడానికి సిద్ధంగా లేరనే విషయం మీరు బయటకు వచ్చాకా తెలుస్తుందన్నారు.