కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Theenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ కుమార్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా పార్టీ లైన్ దాటి తన ఇష్టమొచ్చిన రీతిలో మల్లన్న వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు అధిష్టానానికి అందుతున్నాయి. తాజాగా హన్మకొండలో నిర్వహించిన ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో రెడ్డి సామాజికవర్గాన్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఖాయమని వ్యాఖ్యానించారు. తెలంగాణకు రేవంత్ రెడ్డే(Revanth Reddy) చివరి ఓసీ సీఎం అని తెలిపారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు బీసీల దగ్గర ఉందన్నారు.
మల్లన్న వ్యాఖ్యలపై అన్ని పార్టీలకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Kumbam Anil Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నల్లగొండలో స్వయంగా తాము డబ్బులు ఖర్చుపెట్టి.. అతడిని ఎమ్మెల్సీగా గెలిపించుకున్నామని తెలిపారు. ఇటీవల కాలంలో కావాలనే రెడ్డి సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అతడిపై తప్పకుండా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.