ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తీవ్రంగా స్పందించారు. ప్రవీణ్ కుమార్ పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకు తలపై వెంట్రుకలే కాదు.. లోపల బ్రెయిన్ కూడా లేదని సెటైర్లు వేశారు. కేసీఆర్, కేటిఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని చూసన్నారని.. అందుకే ఫార్ములా ఈ రేసులో రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని ఫిర్యాదు చేశారన్నారు. గతంలో కేసీఆర్ గడీలు, ఫామ్ హౌస్ బద్దలు కొడతామన్న ఆర్ఎస్పీకి ఇప్పుడు మంచి నేతలు అయ్యారా అని ప్రశ్నించారు.
బీఎస్పీ పార్టీని వీడి కేసీఆర్ ఇచ్చే డబ్బుకు కక్కుర్తి పడి పార్లమెంట్ సీటు కోసం నమ్ముకున్న దళిత బహుజన బిడ్డలను నట్టేట ముంచారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కారణంగానే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి రాష్ట్రానికి నష్టం వచ్చిందని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక నుంచైనా ప్రవీణ్ కుమార్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని.. లేదంటే ప్రజలు మిమ్ముల్ని తరిమి కొడతారని రామచంద్ర నాయక్ హెచ్చరించారు.