బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికి తమ ప్రభుత్వం పై చార్జ్ షీట్ విడుదల చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) విమర్శించారు. సోమవారం ఆయన హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పై బీజేపీ విడుదల చేసిన చార్జ్ షీట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా..? అని జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రశ్నించారు. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వం.. కానీ దీనిపై ఇప్పటివరకు స్పందన లేదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న వడ్లకి రూ.500 బోనస్ ఇస్తున్నామని ఆయన చెప్పారు. మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించని మీరా రైతుల గురించి మాట్లాడేది అని బీజేపీని నిలదీశారు. జాతీయ స్థాయిలో రుణమాఫీ చేసి ఉంటే రాష్ట్రానికి రూ.20 వేల కోట్లు ఆదా అయ్యేవి అని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
బీజేపీ చార్జ్ షీట్…
కాంగ్రెస్ వి 6 గ్యారంటీలు.. 66 మోసాలు.. 24X7 దగా.. అంటూ బీజేపీ ఆదివారం చార్జ్ షీట్ విడుదల చేసింది. పాలనలో కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి ఏమీ తేడా లేదని బీజేపీ విమర్శలు గుప్పించింది. “గత సంవత్సరం కాలంగా మార్పు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి.. కాంగ్రెస్ కావాలి అనే నినాదంతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. తెలంగాణ ప్రజలు గత సంవత్సరకాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వంతో కంటే ఎక్కువ కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు” అని బీజేపీ ఆరోపించింది.