Corruption in Mee Seva centers : ‘మీ సేవ’.. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలన్న ఉన్నత లక్ష్యంతో ప్రారంభమైన ఈ కేంద్రాలు, ఇప్పుడు కొందరు అక్రమార్కులకు కాసులు కురిపించే కామధేనువులుగా మారుతున్నాయి. ముఖ్యంగా భూ రిజిస్ట్రేషన్ల విషయంలో, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై, ప్రజల నుంచి వేలకు వేలు అదనంగా దండుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఓ బాధితుడి నుంచి ఏకంగా రూ.8,000 అదనంగా వసూలు చేసి, నకిలీ రశీదు ఇచ్చిన ఘటన, ఈ దందా తీవ్రతకు అద్దం పడుతోంది. అసలు ఈ అక్రమాల పర్వం ఎలా సాగుతోంది..? అధికారుల పాత్ర ఎంత…?
అసలేం జరిగిందంటే : పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని ఓ మీ సేవ కేంద్రంలో, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి స్టాంప్ డ్యూటీ, ఫీజుల కింద రూ.27,724 వసూలు చేశారు. కానీ, అసలు ఛార్జీలు కేవలం రూ.19,724 మాత్రమేనని తర్వాత తేలింది. ఇలా నకిలీ రశీదులతో, అదనపు ఛార్జీలతో ప్రజలను నిలువునా దోచుకుంటున్న ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్వసాధారణమయ్యాయి.
అధికారులతో కుమ్మక్కు.. మధ్యవర్తులుగా ‘మీ సేవ’ : ఈ దందా వెనుక రెవెన్యూ అధికారులు, మీ సేవ కేంద్రాల నిర్వాహకుల మధ్య బలమైన లంకె ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మామూళ్ల మాయాజాలం: ఇటీవల జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో బదిలీ వేటుకు గురైన కొందరు ఎమ్మార్వోలు, మీ సేవ కేంద్రాల ద్వారానే మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తేలింది.
మధ్యవర్తుల రాజ్యం: రెవెన్యూ అధికారులు నేరుగా లంచం తీసుకోకుండా, మీ సేవ కేంద్రాల సిబ్బందిని మధ్యవర్తులుగా వాడుకుంటున్నారు. ‘పనికింత’ అని ముందే రేటు కట్టి, వసూలు చేసి, ఆ తర్వాత వాటాలు పంచుకుంటున్నారు.
స్లాట్ బుకింగ్‌లోనూ తిరకాసు: నేరుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని వెళ్తే, ఏదో ఒక సాంకేతిక కారణం చూపి, దరఖాస్తులను పెండింగ్‌లో పెడుతున్నారు. అదే, మీ సేవ కేంద్రం ద్వారా, మధ్యవర్తికి ‘మామూలు’ ముట్టజెబితే, ఎలాంటి అడ్డంకులు లేకుండా పని పూర్తవుతోంది.
నిబంధనలకు పాతర.. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అదనం : ప్రతి రిజిస్ట్రేషన్‌కు ఫీజులు, ఛార్జీలకు అదనంగా రూ.5,000 నుంచి రూ.10,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. నాలా కన్వర్షన్, ఇతర వివాదాస్పద భూముల విషయంలో ఈ మొత్తం ఇంకా ఎక్కువగా ఉంటోంది. నిబంధనల ప్రకారం, పది గుంటలలోపు వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ, చేతులు తడిపితే చాలు, ఎలాంటి భూమినైనా రిజిస్టర్ చేస్తున్నారు.భూమిపై రుణం ఉన్నా, రిజిస్ట్రేషన్ చేయకూడదన్న నిబంధన ఉన్నా, ఆమ్యామ్యాలు ముడితే అన్నీ సక్రమమే.
ప్రజలకు సేవ చేయాల్సిన ‘మీ సేవ’ కేంద్రాలు, అవినీతి అధికారులకు ‘మామూళ్ల’ కేంద్రాలుగా మారడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి, ఈ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.


