CP Sajjanar on Kidnap Calls by Police Name: హైదరాబాద్ నూతన సీపీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజలను ఏదో ఒక విధంగా ఆయన అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ నేరాలు, మైనర్ కంటెంట్ వీడియోలు.. ఇలా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడరాదని, ప్రజలు అలర్ట్‌గా ఉండాలని నిత్యం సూచనలు చేస్తున్నారు. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక.. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, లేదా సీఐడీ, సీబీఐ, ఐటీ.. ఇలా రకరకాల శాఖల పేర్లు చెప్పి అమాయకులను దోపిడీ చేస్తున్నారు. ఈ క్రమంలో సీపీ సజ్జనార్.. ఎక్స్ వేదికగా మరో అలర్ట్ జారీ చేశారు.
‘మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే నకిలీ ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. మీ పిల్లల పేర్లను చెప్పి, వారు ఏడుస్తున్న శబ్దాన్ని మీకు వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడవద్దని సూచించారు. అత్యాశ, భయం.. ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయని.. తద్వారా అందినకాడికి దోచుకుంటున్నారని వెల్లడించారు.
‘సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే అవగాహనతో కూడిన అప్రమత్తత అవసరం. మీ పిల్లలు, బంధువుల వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దు. బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలి లేదంటే.. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి.’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మీ పిల్లలను కిడ్నాప్ చేసామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త!
పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్దాన్ని వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడకండి.
అత్యాశ, భయం.. ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్నాయి. ఈ నేరాలకు చెక్ పెట్టాలంటే అవగాహనతో కూడిన… pic.twitter.com/RbP5K96Tg0
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 20, 2025


