‘పుష్ప2’(PUSHPA2) బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం చాలా దారుణమని సీపీఐ నేత నారాయణ(CPI Narayana) తెలిపారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇక తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసుకోవాలని సందేశం ఇస్తోందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం సిగ్గులేకుండా టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందని ఫైర్ అయ్యారు. ఇలాంటి సినిమాలను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలని నిలదీశారు.
తొక్కిసలాట ఘటనలో పోలీసుల తప్పేం లేదన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వంమే మొదటి ముద్దాయి అని విమర్శించారు. వేలకు వేలు ఖర్చు పెట్టినా ఈ రోజుల్లో కుటుంబంతో కలిసి సినిమా చూడలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. ఇక నుంచి సందేశాత్మక, చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలకు మాత్రమే రాయితీలు, టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలన్నారు.