Criminal case on Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలై నేపథ్యంలో అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నవీన్ యాదవ్‌పై మధురానగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. దీంతో జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారంటూ మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నవీన్ యాదవ్‌పై బీఎన్ఎస్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల( 170,171,174) కింద క్రిమినల్ కేసు నమోదైంది. ప్రజాప్రాతినిధ్య చట్టంను ఉల్లంఘించడంతో కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.
టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ఖరారు చేసే నేపథ్యంలో నవీన్‌యాదవ్‌పై కైసు నమోదు కావడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ అభ్యర్థిగా నవీన్‌యాదవ్‌ను ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నేడో, రేపో ఇతని పేరును పార్టీ అభ్యర్థిగా ఏఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నవీన్‌యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో ఆయనకు ఓటర్లతో పరిచయాలు ఉన్నాయి. బలమైన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/jubilee-hills-by-election-nov-11/
మోగిన ఎన్నికల నగారా: రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. దివంగత శాసనసభ్యులు మగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో కదనరంగానికి సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తుండగా నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది.


