ఈ ఏడాది హైదరాబాద్(Hyderabad) కమిషనరేట్ పరిధిలో అన్ని పండుగలు ప్రశాంతంగా ముగిశాయని నగర కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) తెలిపారు. ఎన్నికలు కూడా విజయవంతంగా పూర్తి చేశామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నగరంలో హోంగార్డ్ నుండి సీపీ వరకు అందరూ కష్టపడ్డారని.. వారందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. అయితే క్రైమ్ రేట్ మాత్రం కొంత పెరిగిందని వెల్లడించారు.
ఈ సంవత్సరం మొత్తం 35,944 ఎఫ్ఐఆర్(FIR)లు నమోదయ్యాయని.. గత సంవత్సరం కంటే ఈసారి ఎఫ్ఐఆర్‌ల శాతం 45పర్సంట్ పెరిగిందని తెలిపారు. ఇక మర్డర్లు 13 శాతం తగ్గాయని.. అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా తగ్గాయని వెల్లడించారు. కిడ్నాప్ కేసుల్లో 88 శాతం పెరుగుదల ఉందని.. ఆస్తికి సంబంధించిన నేరాల్లో 67 శాతం పెరుగుదల ఉందన్నారు. 36 రకాల సైబర్ నేరాలు నమోదయ్యాయన్నారు. 4042 సైబర్ క్రైమ్‌లు నమోదు చేశామని.. రూ.297 కోట్లు సైబర్ నేరాల్లో పోగొట్టుకున్నారని తెలిపారు. రూ.42 కోట్లు సైబర్ నేరగాళ్ల నుండి రికవరీ చేశామన్నారు. 500 మంది కన్నా ఎక్కువ సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేశామన్నారు. నేరాలు గుర్తించడంలో సీసీటీవీల పాత్ర ముఖ్యమైనదని తెలిపారు.