Cyclone Montha Effect reduced: గత మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన రాకాసి మొంథా.. ఎట్టకేలకు బలహీనపడినట్టుగా భారత వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన మొంథా తుపాను ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశలో తెలంగాణ మీదుగా ప్రయాణిస్తున్నట్టుగా తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ వద్ద మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలతో పాటుగా.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మొంథా ఎందుకు బలహీనపడిందంటే: వాస్తవానికి మొంథా తుపాను వేగాన్ని గమనిస్తే.. 2023లో బాపట్లలో తీరం తాకిన మిచాంగ్ తుపానును తలపించింది. సముద్రంలో తీవ్ర తుపానుగా బలపడటంతో గాలులన్నింటినీ తనలో చేర్చుకొని మరింత బలంగా మారి తీరం వైపు దూసుకువచ్చింది. దీంతో మొంథా తుపాను.. రాష్ట్రంలోని అనేక తీర ప్రాంతాల్ని తుడిచి పెట్టుకుపోతుందని తీర ప్రాంతవాసులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. తుపాను తీరానికి 70 నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న సమయంలో విండ్ షీర్ మొదలైంది. తుపాన్‌లో కీలకమైన సైక్లోన్ ఐ పైనా.. విండ్ షీర్ పంజా విసిరింది. దీంతో తుపాను గాలులు కకావికలమై బలహీనపడినట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విండ్ షీర్ ప్రభావంతో మొంథా తుపాను తన శక్తిని కోల్పోయింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా 110 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులతో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదికలు అంచనా వేసినా.. వాస్తవ స్థితిలో మాత్రం 70 నుంచి 80 కి.మీ. వేగంతో మోస్తరు వర్షాలకే పరిమితమవ్వడంతో తీర ప్రాంతమంతా ఊపిరి పీల్చుకుంది.
Also read:https://teluguprabha.net/telangana-news/cyclone-montha-effect-on-hyderabad/
రైలు పట్టాలపైకి వరదనీరు.. నిలిచిన రైళ్లు: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా.. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. రైల్వే పట్టాలపైకి వరదనీరు ఉప్పొంగి చేరడంతో పట్టాలన్నీ పూర్తిగా మునిగిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు తక్షణమే స్పందించి.. పలు రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపివేశారు. డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేయగా.. మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశారు. పట్టాలపై వరద ఉధృతి తగ్గేవరకు రైళ్ల రాకపోకలు పునరుద్ధరించబడే అవకాశం లేదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని తగ్గించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.


