Cyclone Montha effect: బంగాళాఖాతంలో ఏర్పడనున్న మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం రాత్రి ఏపీలోని కాకినాడ సమీపంలో ఈ తుపాను తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో 5 సెం.మీ నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్: మొంథా సైక్లోన్ ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 11 జిల్లాలకు ఎల్లో, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసినట్లుగా అధికారులు తెలిపారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీను అధికారులు జారీ చేశారు. ఆదిలాబాద్, జనగామ, ఖమ్మం, కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అత్యంత భారీ వర్షాలు కురుసే అవకాశం: మొంథా.. తీవ్ర తుపానుగా మారే సమయంలో గరిష్టంగా గంటకు 110 నుంచి 120 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత క్రమేపీ బలహీనపడుతూ వాయుగుండంగా మారుతుందని అన్నారు. ఆ సమయంలో పెనుగాలులు, అత్యంత భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని 22 జిల్లాల్లో గల స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే కాకినాడలో ఇవాల్టి నుంచి 31వ తేదీ వరకు హాలిడేస్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులు ఉంటాయని తెలిపారు . మొంథా తుపాను ప్రభావం కాకినాడ తీరంపై ఎక్కువ ఉండే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మంగళవారం రాత్రి నాటికి కాకినాడ సమీపంలో.. మొంథా తుపాను తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.


