‘మొంథా’ తుపాను ప్రభావంతో భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి మొదలైన వర్షం బుధవారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యాట్నీ, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుత్బుల్లాపూర్, గాజులరామారం, కూకట్‌పల్లి, మియాపూర్, నిజాంపేట ప్రాంతాల్లోనూ వర్షం కొనసాగుతోంది. రాబోయే రెండు గంటల వ్యవధిలో నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Also Read:https://teluguprabha.net/telangana-news/heavy-rains-cyclone-montha-effect-on-telangana/
‘మొంథా’ ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది.తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలినట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం మొంథా తుపాను ఉత్తర వాయువ్య దిశలో తెలంగాణ మీదుగా ప్రయాణిస్తున్నట్టుగా తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ వద్ద మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.’మొంథా’ తుపాను ప్రభావం తెలంగాణపై కూడా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


