Cyclone Montha effect updates: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుపానుగా బలపడినట్టుగా విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం ఏపీతో పాటు తెలంగాణపై ఉండే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం రాత్రి ఏపీలోని కాకినాడ సమీపంలో ఈ తుపాను తీరం దాటే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 110 కి.మీ వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో 5 సెం.మీ నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.
నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్: ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. మొంథా సైక్లోన్ ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 11 జిల్లాలకు ఎల్లో, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసినట్లుగా అధికారులు తెలిపారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీను అధికారులు జారీ చేశారు. ఆదిలాబాద్, జనగామ, ఖమ్మం, కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం నుంచి చిరుజల్లు కురుస్తూనే ఉంది. నగరం మొత్తం మేఘావృతమై ఉంది.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/heavy-rains-cyclone-montha-effect-on-andhra-pradesh/
ఏపీలో స్తంభించిన రవాణా వ్యవస్థ: పెను తుపాను కారణంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి వచ్చే పలు విమానాలను ఇప్పటికే రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలో ఏకంగా 97 రైళ్లను రద్దు చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో జల రవాణా సైతం నిలిచిపోయింది. పోర్టుల్లో సరుకు రవాణా కార్గో షిప్పులకు లంగరు వేశారు. అంతేకాకుండా నౌకాదళానికి చెందిన పలు నౌకలు ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి.


