Cyclone Shakti in Arabian Sea: భారతదేశ పశ్చిమ తీరంలో ‘సైక్లోన్ శక్తి’ ముంచుకొస్తోంది. అరేబియా సముద్రం లో శుక్రవారం ఏర్పడిన శక్తి సైక్లోన్ శనివారం తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే ఈ తుపాను భారత తీరానికి దూరంగా పశ్చిమ దిశగా కదులుతోందని ఐఎండీ తెలిపింది. దాంతో భారత పశ్చిమ తీరానికి ముప్పు తప్పినట్లేనని స్పష్టంచేసింది. గడిచిన ఆరు గంటలుగా ఈ శక్తి తుపాను గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. తీవ్ర తుపానుతో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని వెల్లడించారు.
ఈ ఏడాది తొలి సైక్లోన్: ప్రస్తుతం ఈ టొర్నడో శక్తి ద్వారకకు పశ్చిమం వైపు 420 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు. పాకిస్థాన్ లోని కరాచీకి పశ్చిమ దిశగా 290 కిలోమీటర్ల ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా శక్తి తుపాను ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుపానుగా నమోదైంది. రెండు రోజుల క్రితం అరేబియా సముద్రంలో ఈశాన్యం వైపు ద్వారకకు 240 కిలోమీటర్ల దూరంలో, పోరుబందర్కు 270 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. అది వాయుగుండంగా బలపడి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తుపానుగా మారింది. శనివారం తీవ్ర తుపానుగా మారి పశ్చిమదిశగా కదులుతోంది.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/heavy-rain-warnings-issued-for-cyclone-ap/
పేరు ఎవరు నిర్ణయిస్తారంటే..?: ప్రపంచ వ్యాప్తంగా 6 ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు, 4 ప్రాంతీయ ఉష్ణమండల తుపాను హెచ్చరిక కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు తుపానుల గురించి పలు సమాచారం అందిస్తాయి. అలాగే వాటికి పేర్లను సైతం పెడుతుంటాయి. ఈ 6 ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాల్లో భారత వాతావరణశాఖ సైతం ఒకటిగా పనిచేస్తోంది. ఇది ఉత్తర హిందూ మహా సముద్రంపై గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల ఉపరితల వేగంతో గాలులు వీచే తుపాన్లకు.. ఐఎండీ పేర్లు పెడుతుంది. అక్షర క్రమం ఆధారంగా ఒక్కో దేశం ఓ తుపానుకు పేరును సూచిస్తాయి. అయితే ప్రతి సారి ఆ పేరు కొత్తగా.. మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. పేరు 8 అక్షరాలకు మించి ఉండరాదు. అది ఏ సభ్య దేశానికీ అభ్యంతరకరంగా ఉండరాదు. అదేవిధంగా ఏ వర్గం ప్రజల మనోభావాలను కూడా దెబ్బతీయకూడదు.


