Saturday, November 15, 2025
HomeతెలంగాణThird degree on a dalit man: దళితుడిపై థర్డ్ డిగ్రీ

Third degree on a dalit man: దళితుడిపై థర్డ్ డిగ్రీ

Chintapally police third degree on a dalit: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ మరో వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మపల్లి గ్రామానికి చెందిన గోరటి వెంకటేశ్ అనే దళిత యువకుడిని పోలీసులు భూవివాదం విషయంలో చిత్రహింసలకు గురిచేశారు. న్యాయం చేయండి సారు.. అని పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే, తీవ్రంగా కొట్టి అతడి చేతులకు బేడీలు వేసి ఖాకీల క్రౌర్యం ప్రదర్శించారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, చేసినట్లు ఒప్పించి.. వీడియోని చిత్రీకరించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ బాధితుడు “తెలుగుప్రభ” ప్రతినిధితో తన గోడును వెల్లబోసుకున్నాడు.

- Advertisement -

కుర్మపల్లి గ్రామానికి చెందిన గోరటి వెంకటేశ్ కారు డ్రైవరుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా వీరికి అదే గ్రామంలో తాతల కాలం నుండి వారసత్వంగా వస్తున్న భూమి ఉంది. ఈ భూమి విషయంలో మహమూద్ అనే వ్యక్తితో వివాదం తలెత్తడంతో గోరటి వెంకటేశ్ జూన్ 10న ఎస్సై రామ్మూర్తికి ఫిర్యాదు చేశాడు. అయితే ఎస్సై రామ్మూర్తి నుండి ఎలాంటి స్పందన రాలేదు. అనంతరం తన భూమిలో గోరటి వెంకటేశ్ హద్దులు ఏర్పాటు చేస్తుండగా.. గమనించిన మహమూద్ చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/harish-rao-slams-kaleshwaram-project-report-calls-it-a-political-conspiracy/

బేడీలు వేసి.. చిత్రహింసలకు గురిచేసి

మహమూద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రామ్మూర్తి బాధితుడిని పోలీస్ స్టేషన్‎కు పిలిచారు. దీంతో తాను జూలై 4న పోలీస్ స్టేషన్‎కు వెళ్ళానని.. ఆ క్రమంలో ఎస్సై రామ్మూర్తి తన సమస్య వినకుండా దుర్భాషలాడుతూ తనను బెల్టుతో తీవ్రస్థాయిలో కొట్టాడని బాధితుడు వాపోయాడు. ” సర్ ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు” అని ప్రశ్నించనందుకు చేతులకు బేడీలు వేసి స్టేషన్‎లోనే ఉంచారని బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేసుకున్నాడు. ‘దివ్యాంగురాలైన నా భార్య పోలీస్ స్టేషన్‎కు వచ్చి ఏమైందని ప్రశ్నించగా, “ఈమెను కూడా నాలుగు దెబ్బలు కొట్టి స్టేషన్‎లో కూర్చోబెట్టండి” అని బెదిరించారు’ అని బాధితుడు వాపోయాడు. దీంతో ఎస్పీకి ఫోన్ చేస్తుండగా తమ ఫోన్‎ను లాక్కున్నారని బాధితుడు తెలిపాడు. అనంతరం ఈ విషయమై తాను జిల్లా ఎస్పీతో పాటు మానవ హక్కుల కమిషన్‎కు ఫిర్యాదు చేశానని పేర్కొన్నాడు.

ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి

కాగా తాను జిల్లా ఎస్పీతో పాటు మానవ హక్కుల కమిషన్‎కు ఫిర్యాదు చేయడంతో ఎస్సై రామ్మూర్తి తనకు ఫోన్ చేసి స్టేషన్‎కు రావాలని పిలవడంతో పెద్దమనుషులతో కలిసి స్టేషన్‎కు రావాలని పిలిచారు. ఈ క్రమంలో ఎస్సై రామ్మూర్తి స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి.. తానే తప్పు చేసినట్లు ఒప్పుకోవాలని బలవంతం చేసి.. చేయని తప్పుని బలవంతంగా తనతో ఒప్పించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ” ఏడేళ్ళ జైలు శిక్ష పడుతుంది.. ఆలోచించుకో, నీకు జైలు శిక్ష పడితే భార్య పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది” అని చెప్పి భయబ్రాంతులకు గురిచేసి.. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా చేసినట్లు ఒప్పించి.. వీడియో చిత్రీకరించి వేధిస్తున్నారంటూ బాధితుడు వాపోయాడు. తాను పైఅధికారులకు చేసిన ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ ఎస్సై ఒత్తిడి చేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/telangana-heavy-rains-today-weather-report-yesterday-rainfall-districts-forecast/

న్యాయం చేయండి
తనను స్టేషన్‎కు పిలిచి ఎస్సై రామ్మూర్తితో పాటు ఇతర సిబ్బంది చిత్రహింసలకు గురిచేశారని, ఈ విషయంలో ఉన్నతాధికారులు తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గోరటి వెంకటేష్ కోరుతున్నాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేయాలని వేడుకుంటున్నాడు.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ చింతపల్లి పీఎస్
కాగా, చింతపల్లి పోలీస్ స్టేషన్ తరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. గతంలోనూ భూవివాదాల్లోనూ పోలీసులు తలదూర్చిన సంఘటనలున్నాయి. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు కబ్జాదారులకు మద్దతుగా నిలుస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కూడా సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకోవడంతో చింతపల్లి ఎస్సై రామ్మూర్తికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కూర్మేడ్‌ గ్రామంలో 32 ఎకరాల భూవివాదం విషయంలో చింతపల్లి ఎస్సై రామ్మూర్తి వేధింపులకు గురిచేస్తున్నారని.. తరచూ ఫోన్‌చేసి, పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ ఓ టీవీ యాంకర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad