హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender)మరోసారి మండిపడ్డారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారు అని ఆరోపించారు. పాతబస్తీలో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కూల్చివేతలు మొదలు పెడితే అక్కడి నుండే తొలగింపులు చేపట్టాలన్నారు.
కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని ఫైర్ అయ్యారు. కుమారి అంటీకి ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. రోజూవారి వ్యాపారాలు చేసుకునే పేదలను అధికారులు కూల్చివేతల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని వెల్లడించారు. అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.