Vijayawada-Hyderabad Highway Traffic After Dasara : దసరా పండుగ సంబరాలు ముగిశాయి, కానీ సొంతూళ్ల నుంచి నగరానికి తిరుగు ప్రయాణమైన వారికి మాత్రం కష్టాలు మొదలయ్యాయి. బతుకమ్మ, దసరా పండుగలకు పల్లెబాట పట్టిన జనం ఒక్కసారిగా తిరిగి రావడంతో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65) జనసంద్రంగా మారింది. సెలవులు ముగియడం, వారాంతం కూడా తోడవడంతో ఆదివారం ఉదయం నుంచి హైవేపై వాహనాల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. అసలు ఈ ప్రయాణ నరకానికి కారణాలేంటి..? ప్రభుత్వం తీసుకున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఫలిస్తున్నాయా…? ఈ రద్దీ నడుమ జరిగిన ఘోర ప్రమాదం ప్రయాణికులను ఎలా భయభ్రాంతులకు గురిచేసింది..?
గంటల తరబడి నిరీక్షణ.. కిలోమీటర్ల కొద్దీ బారులు : సెలవులు ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రజలతో జాతీయ రహదారి-65 కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా నల్గొండ జిల్లా పరిధిలోని పంతంగి, చౌటుప్పల్, చిట్యాల టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఒకదాని వెనుక ఒకటిగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, కార్లు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, వాహనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు.
రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా ప్రజలు హైదరాబాద్‌కు పెద్దఎత్తున తరలివస్తుండటంతో రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నప్పటికీ, ప్రయాణికుల సంఖ్యకు అవి సరిపోవడం లేదు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల నుంచి వచ్చే బస్సులతో ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ నెలకొంది.
రెండు బస్సుల మధ్య కారు.. నుజ్జునుజ్జు : ఈ భారీ రద్దీ నడుమ నల్గొండ జిల్లా చిట్యాల వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రైవేటు బస్సుల మధ్య కారు ఇరుక్కుని నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన గుర్రె జోష్ కుమార్, పైల మురళీ, హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన చల్లా శ్రీహర్ష కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఆదివారం తెల్లవారుజామున చిట్యాల వద్దకు చేరుకోగానే, వారి ముందు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అకస్మాత్తుగా ఆగింది. దీంతో కారు డ్రైవర్ కూడా వెంటనే బ్రేక్ వేశారు. అయితే, వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో ప్రైవేటు బస్సు కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు రెండు బస్సుల మధ్య శాండ్‌విచ్‌లా నలిగిపోయింది. కారులో ఉన్న చల్లా శ్రీహర్ష తలకు బలమైన గాయం కాగా, జోష్ కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే నార్కెట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. శ్రీహర్ష పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


