వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టెందుకు సిద్ధంగా ఉన్నారని, గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుగా తీసుకెళ్లిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం బూత్త్ కన్వీనర్ల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటి గడపకు తీసుకెళ్లి ఓట్లు అడగాలన్నారు. 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే అధ్బుతమైన అవకాశం మనకు దక్కిందని దానిని మనకు అనుకూలంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకమై ఓట్లు అడగాలన్నారు. ప్రతి ఒక్క బూత్ కన్వీనర్ పార్టీ విజయానికి అవసరమైన కార్యచరణ రూపొందించుకొని రేపటి నుంచి ఎన్నికలు అయ్యేంతవరకు బూత్ స్థాయిలో సంపూర్ణ బాధ్యత మీరే తీసుకోవాలని సూచించారు.
సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు.. ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్, బీజేపోళ్లు వస్తారు. వాళ్లను నిలదీసి అడగండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించండని సూచించారు. ఇప్పుడు ఒక్క చాన్స్ అని కాంగ్రెస్ అడుగుతోంది.. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్కు 11 చాన్సులిచ్చామని, అప్పుడు చేయలేని పనులు ఇప్పుడు చేస్తారా? అప్పుడు రైతుబంధు, రైతు బీమా, సాగునీరు, తాగునీరు, ఉచిత కరెంట్, విద్యాసంస్థలు ఎందుకు పెట్టలేదని ప్రజలు ప్రశ్నించేల బూత్ స్థాయిలో మీటింగ్ పెట్టి వివరించాలన్నారు.
ఆగం కాకుండా ఆలోచించి పని చేసే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరండన్నారు.
2014,2018 ఎన్నికలలో ఇచ్చిన హామీలు అదేవిధంగా నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. సమావేశంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, ఈగ మల్లేశం, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.