అధికారం లేకున్నా ప్రజలకు సేవ చేయాలనే అంకితభావం, పట్టుదల మెండుగా ఉన్న నాయకుడు స్వర్గీయ పరిపాటి జనార్దన్ రెడ్డి అని, ఆయన వ్యవసాయ రంగంలో చేసిన ఆలోచనలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన మాజీ శాసన సభ్యులు కృషి విజ్ఞాన కేంద్రం గ్రామ నవనిర్మాణ సమితి వ్యవస్థాపకులు స్వర్గీయ పరిపాటి జనార్దన్ రెడ్డి విగ్రహావిష్కరణను శుక్రవారం గవర్నర్ బండార్ దత్తాత్రేయ చేతుల మీదుగా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయం నుండి జనార్ధన్ రెడ్డితో తనకు పరిచయం ఉందన్నారు. ఒక సందర్భంలో ఇద్దరం కూడా అరెస్టు కావడం జరిగిందన్నారు. జనార్దన్ రెడ్డి కక్ష రాజకీయాలు చేయలేదని కుష్ఠు రోగులకు సేవలు చేసిన మహానుభావుడని అన్నారు.
విద్య, వైద్యం, వ్యవసాయంలో వినూత్నంగా ఆలోచన చేసేవారని. భూసార పరీక్షలు, డ్రోన్ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం ఇవన్నీ జనార్ధన్ రెడ్డి ఆనాడే చేశారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి మోదీ వాటిని పాటించడం గొప్ప విషయం అన్నారు. దేశంలో మోడీ వచ్చాక 12 కోట్ల రైతుల భూములు భూసార పరీక్షలు చేయించడం జరిగిందన్నారు. దానివల్ల సరైన ఫలితాలు రావడం జరుగుతుందన్నారు. దళితులకు 500 ఎకరాల భూములు ఇప్పించి వ్యవసాయం చేపించిన నాయకుడు జనార్ధన్ రెడ్డి అని అన్నారు. ఆయనను ఎప్పుడు ఇస్త్రీ బట్టల్లో చూడలేదన్నారు.
డ్రోన్ ద్వారా పది నిమిషాల్లో ఎకరం పొలానికి మందు స్ప్రే చేయవచ్చని రైతులందరూ సేంద్రియ వ్యవసాయం దిశగా ఆలోచన చెయ్యాలని అన్నారు. సేంద్రియ, డ్రోన్, భూసార పరీక్షలు వీటిని రైతులు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కేవికే ను ఒక స్పూర్తి కేంద్రంగా తయారు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తా అని హామీ ఇచ్చారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ జనార్ధన్ రెడ్డి బంగారు కడ్డీ అని ఆయన మొదటి ఎన్నికల ప్రచారంలో నాగలి గుర్తుతో జనార్దన్ రెడ్డిని ఎత్తుకుని కమలాపూర్ కు తీసుకువచ్చిన గుర్తు తనకు ఉందన్నారు. కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తాను వెళ్లి జనార్ధన్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు తనకు భాష, సంస్కృతి, సంప్రదాయం నేర్పించినట్లు చెప్పారు. ఆ కాలం సంస్కారము ఈ కాలంలో ప్రదర్శిస్త అని వారికి వాగ్దానం చేశానని అదే పాటిస్తున్ననని ముందు ముందు కూడా పాటిస్తానని అన్నారు. ఎన్ని సంవత్సరాలు పదవుల్లో ఉన్నాం అనేది ముఖ్యం కాదు.. పేదవారి కోసం ఏం చేశాము అనేది ముఖ్యం. అని అన్నారు. మరణించినా జీవించి ఉండేవారు తక్కువ.. అలా బ్రతకాలి అని చెప్పిన వ్యక్తి స్వర్గీయ జనార్దన్ రెడ్డి అన్నారు. జనార్ధన్ రెడ్డి ఈ మట్టిబిడ్డ అని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని ఈ ప్రాంతం ధర్మానికి, న్యాయానికి నెలవన్నారు. జనార్ధన్ రెడ్డి విగ్రహావిష్కరణ చేసుకోవడం మాత్రమె కాదు.. వారి విధానాలు మనం పాటించాలని. అదే వారికి ఘనమైన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, పరిపాటి రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, విజయ గోపాల్ రెడ్డి, స్వర్గీయ జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.