Friday, December 12, 2025
HomeతెలంగాణRoad Safety: రహదారిపై రక్షణ కవచం: ప్రమాదాలకు 'డిఫెన్స్ డ్రైవింగ్'​తో చెక్!

Road Safety: రహదారిపై రక్షణ కవచం: ప్రమాదాలకు ‘డిఫెన్స్ డ్రైవింగ్’​తో చెక్!

Defensive driving techniques : రాష్ట్ర రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఘోర ప్రమాదం, ఆర్తనాదాలు, కుటుంబాల్లో తీరని శోకం.. ఇది నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, చలానాలు విధిస్తున్నా ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గణాంకాల ప్రకారం, జరిగే ప్రతి ఐదు ప్రమాదాల్లో నాలుగు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని నిపుణులు తేల్చిచెబుతున్నారు. 

- Advertisement -

ఉమ్మడి వరంగల్ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా ఏటా వేలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతూ వందల కుటుంబాల్లో చీకట్లు నింపుతున్నాయి. ఈ భయానక పరిస్థితిని మార్చేందుకు అధికారులు ఇప్పుడు ‘డిఫెన్స్ డ్రైవింగ్’ అనే విధానంపై దృష్టి సారించారు. ఇటీవల సాక్షాత్తు డీజీపీ శివధర్​రెడ్డి ఈ విధానంపై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారంటే దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.

డిఫెన్స్ డ్రైవింగ్’ అంటే ఏమిటి : సాధారణంగా డ్రైవింగ్ అంటే వాహనాన్ని నడపడంలో మెలకువలు అనుకుంటారు. కానీ, ‘డిఫెన్స్ డ్రైవింగ్’ అనేది అంతకు మించిన ఒక మానసిక వైఖరి. దీని మౌలిక సూత్రం ఒక్కటే: “నా వల్ల ఇతరులకు ప్రమాదం జరగకూడదు.. అదే సమయంలో, ఇతరుల వల్ల నేను ప్రమాదానికి గురికాకూడదు.” ఇది కేవలం మన డ్రైవింగ్‌ను నియంత్రించుకోవడం మాత్రమే కాదు, రోడ్డుపై ఉన్న ఇతరుల కదలికలను, వారి సంభావ్య తప్పిదాలను ముందుగానే ఊహించి, మనల్ని మనం కాపాడుకోవడం.

అంచనా వేయడం: ఎదురుగా లేదా పక్కన వస్తున్న వాహనం వేగాన్ని, వారి ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారు హఠాత్తుగా బ్రేక్ వేస్తారేమో, సిగ్నల్ ఇవ్వకుండా తిరుగుతారేమోనని ముందుగానే అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా మన వాహన వేగాన్ని, దూరాన్ని సర్దుబాటు చేసుకోవాలి.

సురక్షిత దూరం: ముందు వెళ్తున్న వాహనానికి ఎప్పుడూ మూడు సెకన్ల నియమాన్ని పాటిస్తూ, తగినంత దూరంలో ప్రయాణించాలి. దీనివల్ల వారు ఆకస్మికంగా బ్రేకులు వేసినా, గుద్దకుండా ఆపేందుకు సమయం ఉంటుంది.

సురక్షిత ప్రయాణానికి సోపానాలు : ‘డిఫెన్స్ డ్రైవింగ్’ భావనలో భాగంగా ప్రతి వాహనదారుడు తప్పక పాటించాల్సిన కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయి. అవి:
ప్రాణ రక్షణ కవచాలు: కారు నడిపేవారు తప్పనిసరిగా సీటు బెల్టు, ద్విచక్ర వాహనదారులు ISI మార్కు ఉన్న హెల్మెట్ ధరించడం ప్రాథమిక సూత్రం.
అద్దంలాంటి స్పష్టత: కార్లు, బస్సులకు ఉన్నట్లే ద్విచక్ర వాహనాలకు కూడా సైడ్ మిర్రర్లు తప్పనిసరి. వెనుక ఏముందో చూడకుండా ముందుకు వెళ్లడం ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే.
వేగానికి కళ్లెం: జనావాసాలు, పాఠశాలలు, సర్వీస్ రోడ్ల వద్ద వేగాన్ని పూర్తిగా తగ్గించాలి. ముందు వెళ్తున్న వాహనం ఆగితే, దాన్ని దాటుకుని వెళ్లే ప్రయత్నం చేయకుండా ఓపికగా ఆగడం ఉత్తమం.
సంకేతాల ప్రాధాన్యత: యూ-టర్న్ తీసుకునేటప్పుడు, దారి మారుతున్నప్పుడు తప్పనిసరిగా ఇండికేటర్లు వాడాలి. ఇది వెనుక వచ్చేవారిని అప్రమత్తం చేసి, ప్రమాదాన్ని నివారిస్తుంది.
క్రమశిక్షణే రక్ష: ఎల్లప్పుడూ రోడ్డుకు ఎడమ వైపునే ప్రయాణించాలి. ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించడం, రోడ్డుపై ఉన్న లైన్లు, వేగ నిరోధకాలను గమనించకపోవడం వంటివి ప్రాణాలకే ముప్పు.

అమలుకు పోలీసుల కసరత్తు : “డిఫెన్స్ డ్రైవింగ్​తో రోడ్డు ప్రమాదాలు కచ్చితంగా తగ్గుతాయి. వాహనదారులు ట్రాఫిక్​ నియమాలను పాటిస్తే ప్రాణాలకు భయం ఉండదు,” అని ఏసీపీ సత్యనారాయణ భరోసా ఇచ్చారు. “18 ఏళ్లు నిండి, డ్రైవింగ్ లైసెన్సుతో పాటు అన్ని అర్హతలున్న వారే వాహనాలు నడపాలి. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో డిఫెన్స్ డ్రైవింగ్ అమలును  పరిశీలిస్తున్నాం,” అని ఆయన వెల్లడించారు. ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా రహదారులను సురక్షితంగా మార్చవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News