Saturday, November 15, 2025
HomeతెలంగాణViral Fevers: వణికిస్తున్న విషజ్వరాలు..పెరుగుతున్న కేసులు

Viral Fevers: వణికిస్తున్న విషజ్వరాలు..పెరుగుతున్న కేసులు

Viral Fevers: వాతావరణ మార్పులతో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అందరూ రోగాలతో అల్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా పల్లెల్లో జ్వరపీడితులు అధికమవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, ఆర్‌ఎంపీ కేంద్రాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో గ్రామాల్లో వైద్య సేవలు సరిగ్గా అందడం లేదనే విమర్శలూ వెల్లువెత్తున్నాయి. వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమైనా పరిస్థితి చేజారిపోయిందన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. ‘ప్రజలకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం’ అని ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ నాయకులు ఇప్పుడు పల్లెలు, పట్టణాల వైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విషజ్వరాలు కొందరికి ప్రాణాంతంకంగా మారుతున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న డెంగీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వైరల్ జ్వరాలు అయినప్పటికీ.. లక్షణాలు డెంగీని పోలి ఉండడంతో ప్రజలు భయపడుతున్నారు. చిన్న పిల్లల్లో వారం రోజుల తరబడి జ్వరం, మలేరియా, టైఫాయిడ్, రక్త కణాల తగ్గింపు లక్షణాలు ఎక్కువగా ఉండడంతో పరీక్షలు చేయించుకునేందుకు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. డెంగీ, వైరల్ ఫీవర్స్ లక్షణాలు ఒకేలా ఉండడంతో ఏ రోగమో తేల్చుకోలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో అటు వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు కావాల్సిన అన్ని రకాల మందులు, వైద్యులు అందుబాటులో ఉండడంతోపాటు అవగాహన కల్పించేందుకు నిత్యం ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసలు నమోదవుతున్నాయి. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

డ్రైడేలో అధికారుల అవగాహన
సీజనల్ వ్యాధులతోపాటు డెంగీ ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ, గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వారానికి ఒక రోజు (శుక్రవారం) డ్రై డే నిర్వహిస్తున్నారు. డెంగీ బారిన పడకుండా ఎలా ఉండాలి అనే విషయాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లోగానీ ఇంటి పరిసరాల్లో గానీ నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దోమలు స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో వాటి నియంత్రణకు లిక్విడ్‌లు వాడాలని చెబుతున్నారు. పగటి పూట కుట్టే దోమల ద్వారా డెంగీ వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఏడిస్ దోమలతో ఇది ఎక్కువగా విస్తరిస్తుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్ధుర్లు, శరీరం ద్వారా రక్త స్థావరం, కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడం, వాంతులు, విరోచనాలు.. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గర్లోని వైద్యులను సంప్రదించాలంటున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న డెంగీ కేసులు
గతేడాది గున్యాజ్వరాలు రాష్ట్రాన్ని వణికించాయి. పది రోజులుగా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ వెక్టార్‌ బార్న్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ (ఎన్‌వీబీడీసీపీ) గణాంకాల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 500 పై చిలుకు కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే ఈ ఏడాది ఇప్పటికే ఏడువేలకుపైగా కేసులు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ జూలై, ఆగస్టు నుంచి నిత్యం 250కిపైగా కేసులు వస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అంటే ఈ రెండు నెల్లలో 14 వేలకుపైగా కేసులు నమోదైనట్లు సమాచారం. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులకు లేక్కే లేదు. అయితే, ఇప్పటివరకు రాష్ట్రంలో డెంగీమరణాలు నమోదు కాకపోవడం కొంత ఊరటనిచ్చే విషయం.

ప్లేట్లెట్లు తగ్గితే..
సాధారణంగా లక్షన్నర ఉండాల్సిన ప్లేట్లెట్ల సంఖ్య కనీసం యాభై వేలకు తక్కువ అయితే తప్పా కంగారు పడాల్సిన పని లేదు. ఆ తర్వాత కూడా ప్లేట్లెట్లను గమనిస్తూ ఉండాలి. వాటి సంఖ్య పది వేలకు తగ్గితే లేదా ఎక్కడి నుంచి అయినా రక్తస్రావం జరిగితే ప్లేట్లెట్లు ఎక్కించే అవసరం ఉంటుంది. ప్లేట్లెట్ సంఖ్య కంటే హెమటోక్రిట్ (పీసీవీ /హెచ్‌సీటీ) అనే పరీక్ష ఎక్కువ ముఖ్యం. అది శరీరంలో నీరు తగ్గిపోయి, బీపీ పడి పోయే ప్రాణాపాయ పరిస్థితిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. రక్తపరీక్షలో ఐజీఎం లేక ఎన్ఎస్ 1 అనేవి పాజిటివ్ ఉంటేనే డెంగీ ఉన్నట్లుగా నిర్ధారించాలి. ఐజీజీ పాజిటివ్ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. డెంగీ వచ్చిన వారు లక్షణాలను బట్టి మందులు వాడాలి. అధికంగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కొందరిలో జ్వరం తగ్గిన తర్వాత కూడా పరిస్థితి విషమంగా మారే ప్రమాదం ఉంటుంది. జ్వరం వచ్చిన ఐదో రోజు నుంచి రెండు, మూడు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి. కడుపులో నొప్పి, ఎక్కడి నుంచైనా రక్తస్రావం, అధికంగా నీరసం, బీపీ తగ్గిపోవడం, అదుపు కాని వాంతులు, స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం
తీవ్ర జ్వరాలతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారిని యాజమాన్యాలు ఒళ్లు గుల్ల చేస్తున్నాయి. సాధారణ జ్వరానికి, డెంగీకి ఒకే రకమైన ట్రీట్‌మెంట్ ఇస్తూ ప్రజలను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారు. టెస్టుల పేరిట ప్రజల వద్ద నుంచి డబ్బులు లాగేస్తూ ఆర్థికంగా నిలువుదోపిడీ చేస్తున్నారు. కొందరు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే రక్తపరీక్షలు చేసి అనేక మందికి డెంగీగా నిర్ధారిస్తున్నారు. చికిత్సకు ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్లేట్లెట్స్ పేరిట రకరకాల టెస్టులు చేస్తూ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నారు. ఇవీకాకుండా మెడిసిన్ అదనం. నెలంతా కష్టపడితే వచ్చిన సొమ్ము ఒక్క రోజుతో ఆవిరి అయిపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నాణ్యమైన వైద్యం ఎంతైనా ఖర్చు చేస్తూ కొందరు అప్పుల ఊబిలో ఇరుక్కుంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ప్రైవేట్ ఆస్ప్రతులను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించి ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, వర్షాల నేపథ్యంలో ప్రతి గ్రామంలో వైద్యశిబిరాలు నిర్వహించాల్సి ఉన్నా వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని ఏజెన్సీలతోపాటు పట్టణ ప్రాంతాల్లో సైతం విధిగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

ఎన్‌వీబీడీసీపీ గణాంకాల ప్రకారం నమోదైన డెంగీ కేసులు
సంవత్సరం కేసులు
2021 7,135
2022 8,972
2023 8,016
2024 10,077

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad