Deputy CM Bhatti Vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విశాఖపట్నంలో నిర్వహించిన ‘స్టాప్ ఓట్ చోరీ’ కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధానిగా అవుతారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కూడా స్పందించిన భట్టి.. తెలంగాణ ఏర్పాటుకి ప్రధాన కారణం నీటి హక్కులే అన్న సంగతి గుర్తు చేశారు. గోదావరి నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావలసి ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక, రాష్ట్రానికి కేటాయించాల్సిన వాటా స్పష్టమైన తర్వాతే మిగులు జలాలపై చర్చలు జరగాలని స్పష్టం చేశారు.
‘‘సముద్రంలోకి వెళ్లే జలాలు అని మాట్లాడటం సరికాదు. గోదావరిపై మేం చేపట్టిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయంగా ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత మిగులు జలాలుంటే వాడుకోవచ్చు. మా అవసరాలు తీరకుండా దిగువన ప్రాజెక్టులు నిర్మిస్తే కేటాయింపుల్లో సమస్య వస్తుంది’’అని భట్టి అన్నారు.


