గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. పద్మ అవార్డుల విషయంలో.. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అస్తిత్వం, ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, సమాజం కోసం, కలల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఐదుగురు పేర్లను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సిఫార్సు చేసిన కేంద్ర ప్రభుత్వానికి పంపిందని.. కానీ దానిని కేంద్రం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన వారిలో ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. వీరిలో ఏ ఒక్కరూ అర్హులు కారా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజాయుద్ధ నౌక గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయదీర్ తిరుమల రావు పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఐదుగురిలో ఒక్కరికి కూడా అవార్డులు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన వారికి ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం సూచించిన వారికి ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు. అయితే మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇవ్వడం అభినందనీయమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.