యావత్ దేశం తెలంగాణ మోడల్ పై ఆసక్తి చూపుతున్న ప్రస్తుత తరుణంలో దేశానికి దిక్సూచి అనే పుస్తకాన్ని తెలుగుప్రభ దినపత్రిక ప్రచురించింది. కేసీఆర్ సర్కారులో సాగుతున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాపయోగ స్కీములపై ఈ పుస్తకంలో వివరించేలా రచయిత నేలంటి మధు సమకాలీన విషయాలను అక్షరబద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు రమణాచారి ఈ పుస్తకావిష్కరణ చేశారు. కేసీఆర్ పాలనా నైపుణ్యాన్ని చాలా చక్కగా వివరించారని ఈసందర్భంగా రమణాచారి అభినందనలు తెలియజేశారు.
ఈ పుస్తకం సమగ్రం కాదు సందర్భం మాత్రమే అంటూ పబ్లిషర్ సమయమంత్రి చంద్రశేఖర శర్మ ముందుమాటలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం మొదలు, కేసీఆర్ వ్యక్తిగత జీవితం, రాజకీయ దురంధరుడిగా కేసీఆర్ సాధించిన అత్యద్భుతమైన కీలక రాజకీయ ఘట్టాలను ‘దేశానికి దిక్సూచి’ పుస్తకం ద్వారా వివరించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనప్పటికీ అభివృద్ధిలో పరుగులు పెడుతూనే సంపన్న రాష్ట్ర హోదాను సుస్థిరం చేసుకున్న పరిపాలనా నైపుణ్యాన్ని యావత్ దేశ ప్రజలముందుంచేలా ఈ పుస్తకాన్ని తెలుగుప్రభ దినపత్రిక ప్రచురించటం విశేషం.
తెలంగాణకు అసలైన కేరాఫ్ కేసీఆర్, కేసీఆర్ తరచూ ప్రయోగించే తెలంగాణా మాండలికంలోని డైలాగులు, స్లోగన్స్ ను కూడా ఇందులో పొందుపరిచారు. కేసీఆర్ వంటి దార్శనిక నేత ప్రస్తుత రాజకీయాల్లో ఎంత అవసరమో పాఠకులను ఆలోచింపచేసేలా ఈ పుస్తకాన్ని రూపొందించటం హైలైట్. అయితే గొప్ప పరిపాలకుడైన కేసీఆర్ గురించి పూర్తిగా వివరించటం అసాధ్యమన్న ప్రచురణకర్తలు ఇది “చంద్రునికి ఓ నూలు పోగు” మాత్రమేనని పుస్తకంలో ప్రకటించారు.