నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే యాదగిరిగుట్ట(Yadagirigutta)లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు భక్తులు గుట్ట పైకి వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అయితే ఈ బస్సులు సరిపోవడం లేదని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ బస్సులు నడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులు ఏర్పాటుచేస్తున్నారు.