DGP Shivadhar Reddy Comments on Riyaz Encounter Nizamabad: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన రియాజ్ ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు, పోలీసుల ఆత్మ రక్షణలో భాగంగా కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. ఒకవేళ,రియాజ్ చేతికి గన్ వచ్చి ఉంటే ఆసుపత్రిలో బీభత్సం జరిగేదన్నారు. అందుకే, పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో మూడు రోజుల క్రితం కానిస్టేబుల్‌ను హత్య చేసిన రియాజ్ కేసులో పలు ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు హంతకుడు రియాజ్ ఎన్‌కౌంటర్ సంచలనం రేకెత్తిస్తోంది. అరెస్టు అయ్యి 24 గంటల కాక ముందే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో హతమవ్వడం పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ కీలక ప్రకటన చేశారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఆసుపత్రిలో గన్ ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
మూడు రోజుల నుంచి కీలక మలుపులు..
శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు రియాజ్ కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బైక్ చోరీలు, ఇతర నేరాల్లో కీలక నిందితుడిగా ఉన్న రియాజ్ కోసం పోలీసులు చాలా కాలంగా గాలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అతని ఆచూకీ గురించి పోలీసులకు ఓ చిన్న క్లూ దొరికింది. అతను ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన వెంటనే కానిస్టేబుల్ ప్రమోద్ తన మేనల్లుడిని బైక్‌పై ఎక్కించుకొని రియాజ్ ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. ఇంతలో స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. నేరస్తుడు రియాజ్‌ను పట్టుకొని తన బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం ప్రారంభించాడు. ప్రమోద్ బైక్ డ్రైవ్ చేస్తుండగా రియాజ్ మధ్యలో కూర్చొని ఉన్నాడు. వెనుకాల ప్రమోద్ మేనల్లుడు ఉన్నాడు. బైక్ స్టేషన్‌కు వెళ్తున్న టైంలో రియాజ్ ఎదురు తిరిగాడు. అప్పటి వరకు సైలెంట్‌గా కూర్చొని ఉన్న రియాజ్ తన వద్ద ఉన్న కత్తిని ప్రమోద్ గుండెలో పొడిచాడు. బైక్ అదుపు తప్పి ప్రమోద్ కింద పడిపోవడంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. రియాజ్‌ను పట్టుకునేందుకు ప్రమోద్ మేనల్లుడు కూడా ప్రయత్నించాడు. వెనకాలే వస్తున్న ఎస్సై కూడా ట్రై చేశాడు. కానీ వారిద్దర్ని గాయపరిచి రియాజ్ పారిపోయాడు.
ఆత్మ రక్షణలో భాగంగానే కాల్పులు..
కానిస్టేబుల్‌ను హత్య చేసి ఎస్సైతో పాటు పౌరుడిని గాయపరిచి పారిపోయిన రియాజ్ కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులకే రక్షణ కరవైందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. రాష్ట్రంలో గన్ కల్చర్ బాగా పెరిగిందని, నేరస్తులు రెచ్చిపోతున్నారని ఆరోపించాయి. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల తర్వాత ఆదివారం వాళ్లకు ఓ క్లూ దొరికింది. సారంగపూర్ అటవీ ప్రాంతంలో రియాజ్ తలదాచుకున్నట్లు తెలిసింది. వెంటనే వెళ్లి పట్టుకునేందుకు యత్నించారు. కానీ అక్కడ కూడా పోలీసులపై ఎదురు తిరిగేందుకు రియాజ్ ప్రయత్నించాడు. అతన్ని పట్టుకునే క్రమంలో ఓ యువకుడు కూడా గాయపడ్డాడు. ఎట్టకేలకు రియాజ్‌ను పట్టుకొని అతని కాళ్లు చేతులు కట్టేసి మరీ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. సోమవారం ఉదయం ఎక్స్‌రే కోసం తరలిస్తుండగానే ఏఆర్ కానిస్టేబుల్ వద్ద ఉన్న గన్ లాక్కున్నాడు రియాజ్. ఆ గన్‌తో బెదిరించడం మొదలు పెట్టాడు. ప్రజలపైకి కూడా కాల్పులు జరిపేందుకు యత్నించాడు. దీంతో ఆత్మరక్షణ, ప్రజల ప్రాణాల రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో రియాజ్ హతమయ్యాడు.


