సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని కాంగ్రెస్ పార్టీ గార్ల మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు అన్నారు 41 రోజుల నియమ నిష్ఠలతో భక్తిశ్రద్ధలతో దీక్షను పూర్తి చేసుకున్న స్వాములు ఇరుముడి మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
గార్ల మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలోని తిరుపతమ్మ దేవస్థానం ప్రాంగణంలో తిరుపతమ్మ మాల ధరించిన 15 మంది స్వాముల ఇరుముడి పూజా కార్యక్రమంలో ధనియాకుల రామారావు, ఎంపీటీసీ రాజకుమారి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గోసు నగేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతమ్మ మాల ధారణ స్వాములకు పూలమాలలు వేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతమ్మ తల్లి చల్లని చూపులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, పాడిపంటలతో సుభిక్షంగా వెలుగొందాలని, తిరుపతమ్మ మాల వేసుకోవడం పూజలు చేయడం ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని పెంపొందిస్తుందని అన్నారు.
తిరుపతమ్మ తల్లి దర్శనార్థం ఇరుముడి ధరించిన స్వాములు చేసిన తిరుపతమ్మ నామ శరణు ఘోషలు భజన సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మారు మోగింది. ఇరుముడి కార్యక్రమంలో నవీన్, మహేష్, అశోక్, బిక్షం తదితరులు పాల్గొన్నారు.