Saturday, November 15, 2025
HomeతెలంగాణDigital Arrest Scam: పాక్ నటులతో పకడ్బందీ స్కెచ్.. 'డిజిటల్ అరెస్టు'తో కోట్లకు కుచ్చుటోపీ!

Digital Arrest Scam: పాక్ నటులతో పకడ్బందీ స్కెచ్.. ‘డిజిటల్ అరెస్టు’తో కోట్లకు కుచ్చుటోపీ!

International digital arrest fraud : మీ ఫోన్‌కు ఒక అపరిచిత నంబర్ నుంచి వీడియో కాల్ వస్తే? అవతలి వ్యక్తి ఖాకీ యూనిఫాంలో ఉండి, తనను తాను సీబీఐ ఆఫీసర్ అని పరిచయం చేసుకుంటే? మీ ఆధార్ కార్డును ఉపయోగించి ఎవరో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని, మిమ్మల్ని అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని చెబితే..? ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది కదూ! సరిగ్గా ఇదే భయాన్ని ఆయుధంగా చేసుకుని, దేశవ్యాప్తంగా విద్యావంతులనే లక్ష్యంగా చేసుకుని ఓ అంతర్జాతీయ ముఠా కోట్లు కొల్లగొడుతోంది. చైనాలో కూర్చుని, పాకిస్థానీ నటులను పావులుగా వాడుతూ ఐదు దేశాల్లో నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో హైదరాబాద్ వాసులు సైతం చిక్కుకుంటున్నారు. అసలు ఏంటీ ‘డిజిటల్ అరెస్ట్’? పోలీసులమని నమ్మించడానికి వీరు పన్నుతున్న వ్యూహాలేంటి? విద్యావంతులే తేలిగ్గా ఎందుకు మోసపోతున్నారు? ఈ అంతర్జాతీయ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు?

- Advertisement -


సాంకేతికతను అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు తెరలేపారు. ‘డిజిటల్ అరెస్ట్’ అనే పేరుతో అమాయకులను, ముఖ్యంగా చదువుకున్న వారిని మానసికంగా బంధించి, వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ మోసం తీరుతెన్నులు అత్యంత పకడ్బందీగా, సినిమాను తలపించేలా ఉన్నాయి.

మోసపోయేదిలా.. అంచెలంచెలుగా ఉచ్చు..

తొలి అడుగు – భయాన్ని పుట్టించడం: ముందుగా బాధితులకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేస్తారు. అవతలి వైపు పోలీసు లేదా సీబీఐ యూనిఫాంలో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. వెనుక పోలీస్ స్టేషన్ లేదా ప్రభుత్వ కార్యాలయం లాంటి సెటప్ ఉంటుంది. “మీ ఆధార్ కార్డుతో చైల్డ్ ట్రాఫికింగ్ జరిగింది” లేదా “మీ పేరు మీద ఉన్న పార్శిల్‌లో డ్రగ్స్ దొరికాయి” లేదా “బాంబు పేలుళ్ల కేసులో మీ ప్రమేయం ఉంది” అంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తారు.

నమ్మించడానికి నకిలీ పత్రాలు: బాధితుడు తేరుకునే లోపే, వారిని నమ్మించడానికి సుప్రీం కోర్టు ఉత్తర్వులు, ఎఫ్ఐఆర్ కాపీలు, అరెస్ట్ వారెంట్లు అంటూ నకిలీ పత్రాలను వాట్సాప్‌లో పంపుతారు. వాటిపై జాతీయ చిహ్నాలు, అధికారిక స్టాంపులు ఉండటంతో బాధితులు నిజమేనని భ్రమపడతారు.

డిజిటల్ అరెస్ట్’ – మానసిక నిర్బంధం: “కేసు విచారణ పూర్తయ్యే వరకు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. 24 గంటలూ కెమెరా ఆన్ చేసి మా నిఘాలో ఉండాలి” అంటూ ఆదేశిస్తారు. దీనికే వారు పెట్టిన పేరు ‘డిజిటల్ అరెస్ట్’. ఈ సమయంలో బాధితుడిని బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసి, మానసికంగా ఒంటరిని చేస్తారు.

డబ్బు కోసం డిమాండ్: చివరగా, “మీ ఆదాయ వివరాలు, బ్యాంకు ఖాతాలను రిజర్వ్ బ్యాంక్ ద్వారా తనిఖీ చేయాలి. అప్పుడే మీరు నిర్దోషులని తేలుతుంది. మీ ఖాతాలోని డబ్బును మా వెరిఫికేషన్ ఖాతాకు పంపండి, క్లియరెన్స్ రాగానే తిరిగి పంపేస్తాం” అంటూ నమ్మిస్తారు. భయంతో, ఒత్తిడితో ఉన్న బాధితులు వారు చెప్పినట్లు చేసి, కోట్లలో డబ్బును పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యురాలు ఇలాగే రూ. కోటిన్నర, శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ వృద్ధుడు రూ.51 లక్షలు కోల్పోవడమే ఇందుకు నిదర్శనం.

అంతర్జాతీయ ముఠా.. పక్కా వ్యూహం : ఈ మోసాల వెనుక చైనాకు చెందిన సూత్రధారులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి నెట్‌వర్క్ భారత్‌తో పాటు మరో నాలుగు దేశాల్లో విస్తరించి ఉంది.

పావులుగా పాక్ నటులు: భారతీయులను సులభంగా నమ్మించడానికి, భాష, రూపంలో మనకు దగ్గరగా ఉండే పాకిస్థానీ నటులను ఈ ముఠా రిక్రూట్ చేసుకుంటోంది. వారికి ఖాకీ వేషాలు వేసి, సీబీఐ, ఈడీ అధికారులుగా నటింపజేస్తున్నారు.

కంబోడియాలో కాల్ సెంటర్లు: మన దేశంలోని నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి కంబోడియాకు తరలిస్తున్నారు. అక్కడ వారిని బంధించి, ఈ నకిలీ కాల్ సెంటర్లలో టెలీకాలర్లుగా పనిచేయిస్తున్నారు.

క్రిప్టో రూపంలోకి డబ్బు: సింగపూర్, మలేషియాలోని దళారుల ద్వారా బాధితుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును ‘మ్యూల్ ఖాతాల’ నుంచి క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్లుగా మార్చి, అసలు సూత్రధారులకు చేరవేస్తున్నారు. దీనివల్ల నిధుల మార్గాన్ని గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది.

పోలీసుల హెచ్చరిక.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ప్రజలను అప్రమత్తం చేశారు. అసలు ‘డిజిటల్ అరెస్ట్’ అనే ప్రక్రియే చట్టంలో లేదని ఆమె స్పష్టం చేశారు.

“డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు. పోలీసు, ఇతర దర్యాప్తు సంస్థల అధికారులు ఎవరూ ఇలా చేయరు. స్పూఫింగ్, నకిలీ డాక్యుమెంట్స్​తో జాగ్రత్త. నిజమైన అధికారులు వ్యక్తిగత సమాచారం, నగదు డిమాండ్​ చేయరు. అనుమానం వస్తే దగ్గరిలోని పోలీస్​ స్టేషన్​కు వెళ్లి​ విషయం తెలియజేయాలి. వాట్సప్​ మెసేజ్​లు, ఈమెయిల్​, లావాదేవీల స్క్రీన్​షాట్​లు, ఐడీ లను భద్రపరచుకుని వెంటనే సైబర్​క్రైమ్​ హెల్ప్​లైన్​ నంబరు 1930 కు ఫిర్యాదు చేయాలి. లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.”
– కవిత, డీసీపీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్

ఎంతటివారినైనా బురిడీ కొట్టించగల ఈ సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా, వెంటనే స్థానిక పోలీసులను లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad