Dispute Over Maganti Gopinaths Legal Heirs Sparks Fresh Family Drama: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో వారసత్వ వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. రోజుకో ట్విస్ట్‌తో ఉత్కంఠ రేపుతోంది. మాగంటి గోపీనాథ్ మరణం వెనుక పెద్ద కుట్ర జరిగిందని తన తల్లి, మొదటి భార్య కొడుకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తన తల్లి ఒక అడుగు ముందుకేసి, మాగంటి మరణంపై లోతైన దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు. తాజాగా, మాగంటి కొడుకు ప్రెస్‌క్లబ్‌లో తల్లి మాలినితో కలిసి మీడియా ముందుకొచ్చాడు. తన తండ్రి రెండవ భార్య సునీత మాగంటిపై, బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి మరణం వెనుక, తనను చట్టబద్ధమైన వారసుడిగా గుర్తించకపోవడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు.
కుట్రలో భాగంగానే నన్ను పక్కన పెట్టారు..
లీగల్ హెయిర్ సర్టిఫికెట్‌లో తన పేరును చేర్చకపోవడాన్ని మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ తీవ్రంగా ఖండించారు. తన గుర్తింపును ప్రశ్నిస్తున్న వారికి సమాధానంగా ప్రభుత్వ గుర్తింపు పత్రాలను మీడియాకు చూపించారు. “వాళ్ళు నన్ను ఎవరో కొసరాజు అని, చెన్నైలో, యూఎస్‌లో ఉంటాడని అంటున్నారు. కానీ నా బర్త్ సర్టిఫికెట్, నా పాస్‌పోర్ట్, నా ఆధార్ కార్టు అన్నింటిలో నా తండ్రి పేరు ‘మాగంటి గోపీనాథ్’ అని స్పష్టంగా ఉంది. ఇవన్నీ ప్రభుత్వ ఐడీలే” అని తారక్ ఆధారాలను బయటపెట్టారు. తన తల్లిదండ్రులు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని, దానికి సంబంధించిన కోర్టు పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. “మా నాన్నగారు విడాకుల కోసం అప్లై చేసి ఆయనే హాజరుకాలేదు. దాంతో కోర్టు ఆ పిటిషన్‌ను ‘డిస్మిస్డ్ బై డిఫాల్ట్’గా కొట్టివేసింది. ఆ డిక్రీ కాపీ మా వద్ద ఉంది. అంటే చట్టం ప్రకారం వారు ఇంకా భార్యాభర్తలే.” అని తారక్ కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. తనను ఎవరో తెలియదని అంటున్న సునీత.. తన తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పటి నుండి నిరంతరం తనతో టచ్‌లో ఉన్నారని తెలిపాడు. దీనికి సాక్ష్యంగా తన యూఎస్ నంబర్‌కు వచ్చిన వాట్సాప్ కాల్ లాగ్‌లను ఆయన చూపించారు.
కేటీఆర్ అంకుల్‌తో ఉద్యోగం ఇప్పిస్తా అన్నారు
ఈ సంభాషణల వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందని తారక్ సంచలన ఆరోపణ చేశారు. తనను అమెరికా నుండి ఇండియాకు రాకుండా ఆపేందుకే ఈ నాటకం ఆడారన్నారు. “నేను గ్రాడ్యుయేట్ అయ్యాను, జాబ్ వెతుక్కుంటున్నా అని చెప్పాను. దానికి ఆవిడే ఫోన్ చేసి, నువ్వు ఇండియా రావక్కర్లేదు, నీ రెజ్యూమె పంపించు. ఇక్కడ కేటీఆర్ అంకుల్ ఉన్నారు. ఆయన కంపెనీలు ఉన్నాయి. మేము చూసుకుంటాం.’ అని చెప్పారు. ఇదంతా నన్ను బ్రెయిన్‌వాష్ చేసి, ఇక్కడ వాళ్లు చేసుకునే చట్టపరమైన పనులకు అడ్డులేకుండా చూసుకోవడానికే.” అని తారక్ ఆరోపించారు. అంతేకాదు, తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాకుండా తనను అడ్డుకున్నారని తారక్ ఆవేదన వ్యక్తం చేశారు. “కొంతమంది యాంటీ-సోషల్ ఎలిమెంట్స్, బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నన్ను బెదిరించి అంత్యక్రియలకు రాకుండా చేశారు.” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రానివ్వకపోగా, తన పెద్దనాన్న, నాన్నమ్మపై లేనిపోనివి కల్పించి చెప్పారని “వాళ్లు శవంతో రాజకీయాలు చేస్తున్నారు, వాళ్లతో మాట్లాడకు.” అని సునీత తనతో చెప్పి, కుటుంబంలో చీలికలు తెచ్చే ప్రయత్నం చేశారని తారక్ ఆవేదన వ్యక్తం చేశానరు. తాను యూఎస్‌లో ఉండగానే, తనతో మాట్లాడుతూనే, ఇక్కడ దొంగచాటుగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారని తారక్ అన్నారు. “జూన్ 25న వాళ్లు సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు, జూలై 4న అది వచ్చేసింది. కానీ నాతో జూన్ 7 నుండే క్లోజ్‌గా మాట్లాడుతూ నా ప్లాన్స్ అడిగి తెలుసుకున్నారు. నా వెనుక ఇంత కుట్ర జరుగుతోందని నాకు తెలియలేదు.” అని ఆరోపించారు. దివంగత ఎమ్మెల్యే చట్టబద్ధమైన కుమారుడిగా తనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతానని, ఈ కుట్రను బయటపెడతానని తారక్ స్పష్టం చేశారు.


