దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad Airport) పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. విమానాశ్రయానికి 10 కి.మీ. పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించినట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రజల భద్రతలో భాగంగా రిమోట్లీ కంట్రోల్డ్ డ్రోన్‌లు, పారా-గ్లైడర్‌లు, రిమోట్లీ కంట్రోల్డ్ మైక్రో-లైట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు ఎగరడంపై నిషేధం విధిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించే ఏ వ్యక్తి అయినా సంబంధిత చట్ట విభాగాల ప్రకారం శిక్షార్హులు అవుతారని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఈ నిషేధం జూన్ 9 వరకు అమల్లో ఉంటుందని ఆయన వెల్లడించారు.