పేదల భూములను కబ్జా చేసిన ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajender) కన్నెర్ర జేశారు. పేదల భూములను ఆక్రమిస్తావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలంలో ఏకశిలా ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి ఈటల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భూమిని కబ్జా చేసిన కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో ఆగ్రహించిన ఈటల తన అనుచరులతో వారిపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఈటల ఓ బ్రోకర్‌పై చేయి చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. పేదలు కొనుక్కున్న జాగాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారని.. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో కూల్చివేతలు తప్ప.. పేదల కన్నీళ్లు పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు.