Election commission clarify on ink mark: స్థానిక ఎన్నికల్లో ‘సిరా’ చుక్కపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. మొదటగా రెండు దశల్లో జరగనున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా.. ఓటర్ ఎడమచెయ్యి చూపుడు వేలుపై వేసిన ఓటుకు గుర్తుగా సిరా చుక్క వేయాలని ఎన్నికల అధికారులకు పేర్కొంది. ఆ తర్వాత జరిగే మూడుదశల గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటరు మధ్యవేలుపై సిరాచుక్క వేయాలని తెలిపింది. ఎస్‌ఈసీ కార్యదర్శి మంద మకరందు ఈ మేరకు ఓ సర్క్యులర్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, అదనపు కలెక్టర్లు (స్థానికసంస్థలు), జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, రిటరి్నంగ్ అధికారులకు సమాచారం అందించారు.
ఐదు దశల్లో ఎన్నికలు: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. త్వరలోనే నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించిన తర్వాత… గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్ సైతం అమలులోకి వచ్చింది. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరుగును. అదేవిధంగా అక్టోబర్ 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో విడత పోలింగ్ ఉంటుందని ఈసీ పేర్కొంది. ఆ తర్వాత మూడుదశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా ఈసీ తెలిపింది. ఈ నెల 31, నవంబర్ 4, 8 తేదీల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read:https://teluguprabha.net/telangana-news/supreme-court-verdict-on-bc-reservations-telangana/
అభ్యర్థి స్థానికుడై ఉండాలి: పార్టీ గుర్తుపై నిర్వహించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థి స్థానికుడై ఉండటంతో పాటు పార్టీ నుంచి కూడా అధికారికంగా బీఫారమ్ తీసుకోవాలి. పార్టీ నుంచి బీఫారమ్ లేకపోయినా స్వతంత్రంగా పోటీ చేసుకునే వెసలుబాటు ఉంటుంది. కానీ దానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. లేకపోతే ఆయా అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించే అవకాశం ఈసీకి ఉంటుంది.
ముఖ్యమైన నిబంధనలు:
- ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి కచ్చితంగా గ్రామపంచాయతీలో లేదా ప్రాదేశిక నియోకవర్గంలో ఓటు హక్కు పొంది ఉండాలి.
- పోటీలో ఉండాలనుకునే వ్యక్తి పేరు ఓటింగ్ లిస్టులో తప్పనిసరిగా నమోదై ఉండాలి.
- నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి పోటీ చేయాలనుకునే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
- జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు సైతం ఆస్కారం ఉంది.
- మహిళలకు రిజర్వు చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్ స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేయవచ్చు.
- నేరాలకు పాల్పడి.. శిక్ష అనుభవిస్తున్న వారు పోటీకి అనర్హులు. నేర శిక్షను అనుభవించిన తర్వాత 5ఏండ్లు పూర్తి కాని వారు కూడా అనర్హులు.
- మతిస్థిమితం లేని వారు, మూగవారు అనర్హులు.
- గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు కూడా అనర్హులే. బకాయిల చెల్లింపులకు నోటీసులు ఇచ్చినా చెల్లించిన వారు కూడా పోటీకి అనర్హులు.
- ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు సైతం అనర్హులే.


