Panchayat Elections Free Symbols Allotted: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల గుర్తులను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. బ్యాలెట్ చివరి గుర్తి నోటా ఉండాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో(డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో) జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఆయా గ్రామ పంచాయతీల్లో వార్డు, సర్పంచ్ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇక ప్రధాన పార్టీలు.. తమ పార్టీల తరఫున అభ్యర్థులను నిలబెడుతుండగా.. పెద్ద ఎత్తున స్వతంత్రులు సైతం బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
కాగా, పార్టీల గుర్తుల మీద స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించరనే విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌ను విడుదల చేస్తుంది. ఆయా పార్టీలు తమ తమ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నా.. వారికి ఏ పార్టీ గుర్తు కేటాయించరు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికలకు 30, వార్డు సభ్యుల కోసం 20 గుర్తులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో గుర్తింపు లేని, రిజిస్టర్ అయిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల సంఘం విడుదల చేసే ఫ్రీ సింబల్స్‌ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సం’గ్రామ’ పోరు నేపథ్యంలో గ్రామ స్థాయిలో ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం 7 రోజుల పాటు సీఎం జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. డిసెంబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్, 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో పర్యటిస్తారని పార్టీ నేతలు వెల్లడించారు. మరో నాలుగు రోజులు ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉందని సమాచారం. కాగా, పరిమిత సమయం నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోనే పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

