Sheep Distribution Scam : తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం కీలక విచారణ చేపట్టింది. ఈ కుంభకోణంలో నష్టపోయిన బాధితులు, రైతుల వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు.
విచారణలో భాగంగా, రైతుల నుంచి గొర్రెలు, మేకలను ఎవరు తీసుకెళ్లారు? నగదు చెల్లింపులు ఎలా జరిగాయి? అన్న వివరాలను అధికారులు ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడిన దళారుల గురించి, వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులు, అధికారుల పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఎన్ని యూనిట్ల గొర్రెలను అక్రమంగా విక్రయించారో నమోదు చేసుకున్నారు. బాధితులకు అందాల్సిన డబ్బును దళారుల ఖాతాల్లోకి ఎవరు మళ్లించారు? ఈ కుంభకోణానికి ఎవరు ప్రధాన సూత్రధారులు? అన్న అంశాలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు.
ఈ స్కామ్‌లో ఇప్పటికే పట్టుబడిన పలువురు నిందితులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కుంభకోణంలో భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈడీ విచారణతో ఈ స్కామ్‌లోని అసలు దోషులు బయటపడతారని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి.


