తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) సందడి మొదలైంది. రెండు రాష్ట్రాల్లో కలిపి నేటి నుంచి రెండు గ్రాడ్యుయేట్, మూడు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 10వ తేదీ వరకు సమయం ఉంది. ఈ నెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇక ఈనెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఈ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, అదే ప్రాంతానికి చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏపీలో ఉభయ గోదావరి-కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ టీచర్ స్థానానికి ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. మరోవైపు ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.