local body election schedule soon: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రేవంత్ సర్కార్ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీకి కసరత్తు కొనసాగిస్తూనే.. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే బీసీలకు 42 శాతం కోసం ప్రత్యేక జీవోను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. జీవో వెలువడిన వెంటనే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుందని సమాచారం. ఆ వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌తో కూడిన నోటిఫికేషన్‌లు వెలువడనున్నట్టు తెలుస్తోంది.
సామాజికవర్గాల శాతాన్ని బట్టి రిజర్వేషన్లు: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిజర్వేషన్లను ఖరారు చేయగా.. గ్రామ, మండల, జడ్పీటీసీల వారీగా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వివరాలను కూడా సిద్ధం చేస్తోంది. ఆయా కేంద్రాలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సామగ్రి, యంత్రాంగానికి సంబంధించిన వివరాల సేకరణ కూడా ఇప్పటికే పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు వార్డు సభ్యుల నుంచి జడ్పీ చైర్‌పర్సన్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలను ఆయా సామాజికవర్గాల శాతాన్ని బట్టి ఖరారు చేసినట్లు సమాచారం. రిజర్వేషన్లు, జనాభా, సామాజిక వర్గాల వారీగా ఎలా ఉన్నాయన్న అంశాలపై జిల్లాల కలెక్టర్లు బుధవారం మరోసారి పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో భద్రపరిచి ఉంచగా.. ఒక సెట్‌ను బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. వాటిని పంచాయతీరాజ్ శాఖ మరోసారి పరిశీలించనుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. వాటన్నింటినీ క్రోడీకరించి గురువారం సాయంత్రానికి సమగ్రమైన మరో నివేదికలను ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం. దీంతో ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు నుంచి అందిన సమాచారం. దీంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్ మొదలైంది
అదే ఆనవాయితీని కొనసాగిస్తారా?: మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సమరానికి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. అయితే ఏ ఎన్నికలు మొదలు జరుగుతాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే మొదలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని సమాచారం. ఆ తరువాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాకుండా సర్పంచ్ ఎన్నికలు 2 దశల్లో ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ప్రత్యేక జీవో విడుదలైన అనంతరం ఏ ఎన్నికలు మొదట నిర్వహిస్తారనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థలకు తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. ఆ తరువాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని పలువురు కాంగ్రెస్ పెద్దలు గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తారా..లేదా వేచి చూడాల్సిందే.


