Saturday, November 15, 2025
HomeతెలంగాణElectricity Fraud : ఇళ్లు లేవు.. కానీ బిల్లులొస్తున్నాయ్! కబ్జాదారులకు కరెంట్ అధికారుల అండదండలు!

Electricity Fraud : ఇళ్లు లేవు.. కానీ బిల్లులొస్తున్నాయ్! కబ్జాదారులకు కరెంట్ అధికారుల అండదండలు!

Electricity connection fraud for land grabbing : అక్కడ ఇల్లు లేదు, నిర్మాణం లేదు.. కానీ విద్యుత్ మీటర్ ఉంది. ప్రతినెలా క్రమం తప్పకుండా కరెంట్ బిల్లు వస్తుంది. ఆ ఇల్లు ఎక్కడుందో విద్యుత్ అధికారులకు తప్ప మరెవరికీ కనిపించదు. ఇదంతా హైదరాబాద్ శివార్లలో భూముల ధరలకు రెక్కలు వచ్చిన ప్రాంతాల్లో జరుగుతున్న విద్యుత్ మాయాజాలం. క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటంతో భూ కబ్జాదారులకు అక్రమ మార్గంలో అండగా నిలుస్తున్నారు. అసలు ఇళ్లు లేని చోట మీటర్లు ఎలా వెలుస్తున్నాయి..? ఈ దొంగ బిల్లులతో కబ్జాదారులు ఏం చేస్తున్నారు? ఈ చీకటి బాగోతంపై ఓ కథనం.

- Advertisement -

విలువైన భూములను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా కొందరు అక్రమార్కులు కొత్త ఎత్తుగడ వేశారు. ఖాళీ స్థలంలో తాము నివసిస్తున్నట్లు కోర్టులో రుజువు చేసుకునేందుకు విద్యుత్ బిల్లులను ఒక కీలక సాక్ష్యంగా వాడుకుంటున్నారు. ఇందుకు కొందరు అవినీతిపరులైన విద్యుత్ శాఖ సిబ్బంది వారికి సహకరిస్తున్నారు. నిబంధనల ప్రకారం, కొత్త కరెంట్ కనెక్షన్ ఇవ్వాలంటే సంబంధిత ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్)తో పాటు ఇతర సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటిని తనిఖీ చేయాలి. కానీ, లంచాలకు ఆశపడిన కొందరు సిబ్బంది, ఖాళీ స్థలాల్లోనే ఇళ్లు ఉన్నట్లు పత్రాలు సృష్టించి, ఎలాంటి తనిఖీలు లేకుండానే కనెక్షన్లు మంజూరు చేసేస్తున్నారు.

రాజేంద్రనగర్‌లో బట్టబయలైన అక్రమం: ఇటీవల ఈ బాగోతం రాజేంద్రనగర్ విద్యుత్ సబ్-డివిజన్ పరిధిలో వెలుగుచూసింది. న్యూగ్రీన్ సిటీ కాలనీలోని ఏడు ఖాళీ ప్లాట్లలో ఎలాంటి ఇళ్లు లేకపోయినా, కొన్ని నెలలుగా కరెంట్ బిల్లులు జారీ అవుతున్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ ప్లాట్లను ఆక్రమించిన భాస్కర్ రావు అనే వ్యక్తి, ఇళ్లు కట్టకుండానే అక్రమంగా కరెంట్ కనెక్షన్లు పొందాడని, మీటర్లను వేరేచోట పెట్టుకుని బిల్లులు సృష్టిస్తున్నాడని ఆ స్థలాల అసలు యజమానులు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు, అక్కడ ఖాళీ ప్లాట్లకే కనెక్షన్లు ఇచ్చి, మీటర్లు ఉన్నట్లుగా బిల్లులు జారీ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలకు సిఫార్సు చేస్తామని సీవీఓ నారాయణ తెలిపారు. ఈ వ్యవహారంపై బుద్వేల్ ఏఈ దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా, ఆ కనెక్షన్లు గతంలో ఇచ్చారని, ప్రస్తుతం సరఫరా నిలిపివేశామని తెలిపారు. “మీటర్లు సంబంధిత ప్లాట్లలోనే ఉన్నాయా?” అని ప్రశ్నించగా, “అక్కడ లేనిమాట నిజమే” అని ఆయన అంగీకరించడం గమనార్హం. ప్రతినెలా రీడింగ్ తీసుకునే సిబ్బంది కూడా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించగా, ఆయన వద్ద సమాధానం లేదు.

బోగస్ పత్రాలతో భూ కబ్జాలకు మార్గం: ఇదే తరహా మోసాలు అల్లాపూర్ ప్రాంతంలోనూ జరిగాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించిన కొందరు, సర్వే నంబర్ల పక్కన గీత పెట్టి (బై నంబర్) ఏదో ఒక అంకె వేసి బోగస్ పత్రాలు సృష్టించారు. వాటి ఆధారంగా కరెంట్ కనెక్షన్లు పొందారు. ప్రతినెలా వారి చిరునామాతో వస్తున్న ఈ కరెంట్ బిల్లులను న్యాయస్థానాల్లో సాక్ష్యాలుగా చూపిస్తూ, ఆ స్థలాలు తమవేనంటూ పోరాటానికి దిగుతున్నారు. కోర్టులో కేసు విచారణ పూర్తయ్యే వరకు వారిని ఆ స్థలాల నుంచి కదిలించడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.

క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరగడం అసాధ్యమని డిస్కం విజిలెన్స్ అధికారులే అంగీకరిస్తున్నారు. రాజేంద్రనగర్, ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, పటాన్‌చెరు వంటి అత్యంత విలువైన ప్రాంతాల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి వందలాది అక్రమ కనెక్షన్లు బయటపడతాయని వారు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad