ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ యాసంగి పంటల కొనుగోలు కోసం మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రంలోని pacs అధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దీంతో మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. పెద్ద వంగరలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఆయన బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక రైతులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రైతులకు పంటల కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్న ప్రభుత్వం సీఎం కెసిఆర్ ది అన్న ఆయన, రాష్ట్రంలో ఈ యాసంగిలో 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గత వానా కాలంలో కోటి టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినట్టు, రాష్ట్రంలో 24లక్షల టన్నుల నుండి కోటి 41 లక్షల టన్నులకు వరి ధాన్యం ఉత్పత్తి పెరిగిందన్నారు. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల నుండి 65 లక్షల ఎకరాలకు వరి సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు ఎర్రబెల్లి. ఈ యాసంగిలో 15 కోట్ల రూపాయలతో వరి ధాన్యం సేకరణ చేస్తున్నట్టు, ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2 వేల 60 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2 వేల 40 రూపాయలు నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.