పాలకుర్తి నియోజకవర్గంలోని వావిలాల, ముత్తారం గ్రామాల్లో జరిగిన బి అర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని ఆరాచక శక్తులు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, అస్థిర పరచాలని చూస్తున్నాయని ఎర్రబెల్లి ఆరోపించారు. అలాంటి శక్తులే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు పన్నుతున్నాయని, బిఅర్ ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో బీజేపీ ఉందని ఎర్రబెల్లి అన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని వావిలాల, ముత్తారం గ్రామాల్లో జరిగిన బి అర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. వావిలాల, మల్లంపల్లి, భిక్యా నాయక్ పెద్ద తండా, హఠ్యా తండా, నారబోయిన గూడెం గ్రామాలకు కలిపి వావిలాల గ్రామంలో, ముత్తారం, వల్మీడి, సిరిసన్న గూడెం, కంబాలకుంట తండా తదితర గ్రామాలకు కలిపి ముత్తారం గ్రామంలో ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. మంత్రికి ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్థులు, గ్రామ పొలిమేరలో స్వాగతం పలికారు. దారి పొడవునా పూలు చల్లుతూ, కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, నృత్యాలు చేస్తూ, ఎద్దుల బండి పై ఊరేగిస్తూ ఘనంగా స్వాగతం పలికారు.
కాగా, ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తల కోరిక మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వారి సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావులు కోలాటం, లంబాడా నృత్యాలు చేశారు. చూపరులను ఆకట్టుకున్నారు. అందరికీ ఆకర్షణగా నిలిచారు. బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావులు మహిళలతో కలిసి భోజనాలు వడ్డిస్తూ, వారితో కలిసి భోజనాలు చేశారు. మహిళలతో ముచ్చటిస్తూ, సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామాల వారీగా పార్టీ ముఖ్యులు, నాయకులు, కార్యకర్తల పేర్లు చదువుతూ వాళ్ళందరికీ ఆత్మీయ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ఫోటోలు దిగుతూ, వారితో తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఆయా గ్రామాల ప్రజలు కార్యకర్తలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే మంత్రి పరిష్కరించారు. ఇండ్లు, పెన్షన్లు, దళిత బంధు, కమ్యూనిటీ హాళ్లు వంటివి చర్చించారు. కొన్ని సామాజిక కులాలకు కమిటీ హాళ్లు, గుడులను అక్కడికక్కడే మంత్రి మంజూరు చేశారు.