జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో వివిధ అభివృద్ది పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా కొడకండ్ల మండల కేంద్రంలో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి, రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. ఆ తరువాత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం శివరాత్రి ఇద్దయ్య గారి స్మారకార్థం వారి కుటుంబం కొడకండ్ల గ్రామ పంచాయతీకి డెడ్ బాడీ ఫ్రీజర్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అందచేశారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…. ఒకప్పుడు కరువు కాటకాలతో విలవిలలాడిన కొడకండ్ల, ఇప్పుడు కరువుతీరా అభివృద్ధి జరిగి కళకళలాడుతున్నదన్నారు. కొడకండ్ల ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేశాను అని చెప్పారు. ఇక్కడి చేనేత కార్మికుల కోసం, ఆ వృత్తి మీద ఆధార పడి జీవిస్తున్న అనేక మందికి ఉపాధి కలిగే విధంగా కొడకండ్ల లో మినీ టెక్స్ట్ టైల్ పార్క్ ను మంత్రి కేటీఆర్ తో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. రోడ్లు బాగు అయ్యాయి. గ్రామాల్లో అంతర్గతంగా సీసీ రోడ్లు వచ్చాయి. గతంలో లో రూ.6 కోట్లు సీసీ రోడ్లకు ఇచ్చాను. ఇప్పుడు కొత్తగా రూ.5 కోట్లు ఇస్తున్నాను. బయ్యన్న వాగు మీద రూ.9 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తున్నామని, కొడకండ్లలో అన్ని రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తున్నాను అన్నారు. అలాగే కొడకండ్ల లో రోడ్డు వెడల్పు చేసి, డివైడర్లు , సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెడుతున్నట్లు తెలిపారు. ఒక్క కొడకండ్లకే రానున్న రోజుల్లో రూ. 100 కోట్లు ఖర్చు చేసి కొడకండ్ల రూపు రేఖలు మారుస్తాను అన్నారు. ఇది కొడకండ్లేనా? అనే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలనుద్దేశించి అన్నారు.
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి సీఎం కెసిఆర్ ఆశీస్సులతో కుట్టు శిక్షణ ఒక్క పాలకుర్తి నియోజకవర్గంలోనే చేపట్టిన విషయం తెలిపారు. రాష్ట్రంలో మన నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం అన్నారు. పాలకుర్తి ప్రజల కోసం ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు.
ఇక్కడి రైతులు, కూలీలు హైదరాబాద్ కు, వలస పోయారు. సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో ఇక్కడి అభివృద్ధిని చూసి ఇప్పుడు వాళ్లంతా వాపస్ వస్తున్నారన్నారు. వచ్చిన వారంతా ఇక్కడ వ్యవసాయం, ఇతర పనులు చేసుకుంటూ… జీవిస్తున్నారని అన్నారు. దండుగ లాగా ఉన్న వ్యవసాయం ను పండుగ చేసిన ఘనత సీఎం కెసిఆర్ గారిదేనని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
కొడకండ్లలో కుల సంఘాల కోసం సామాజిక భవనాలను మంజూరు చేసి వారికి కార్యక్రమాలు చేసుకోవడానికి వేదిక నిర్మిస్తున్నాం అన్నారు. మీ కోరిక మేరకు గ్రామంలో దేవాలయాల పునరుద్ధరణ జరిగాయన్నారు. ముస్లిం, క్రిస్టియన్ ల కోరిక మేరకు మసీదులు, చర్చీల మరమత్తు కు నిధులు ఇచ్చాను అన్నారు. అలాగే మండల మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నాను అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
కష్ట కాలంలో కొడకండ్ల నన్ను ఆదుకున్నది. నేను కొడకండ్ల ను, ప్రజలను ఆదుకుంటాను అన్నారు. నన్ను ఎన్నుకుని కడుపులో పెట్టుకున్న నియోజకవర్గానికి, ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని అభివృద్ది చేసి మీ రుణం తీర్చుకుంటాను అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.