Saturday, November 23, 2024
HomeతెలంగాణErrabelli: ఎర్రబెల్లి ట్రస్ట్ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా

Errabelli: ఎర్రబెల్లి ట్రస్ట్ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా

యువ‌త‌ కొరకే ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా

మ‌హిళ‌లు ఆర్థికంగా ఎదిగితేనే, ఆ కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగుప‌డుతుంద‌ని, అందుకే సీఎం కెసిఆర్ ప్ర‌భుత్వం, తాను కూడా మ‌హిళ‌ల ఆర్థిక అభివృద్ధి కోస‌మే పాటుప‌డుతున్నామ‌ని రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం, పెద్ద వంగర మండ‌లంలో మంత్రి ఎర్ర‌బెల్లి సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పెద్ద వంగర మండ‌ల కేంద్రంలో నిర్వ‌హిస్తున్న కుట్టు శిక్ష‌ణా కేంద్రాన్ని ప‌రిశీలించారు. శిక్షణ పొందుతున్న మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు. శిక్షణ ఎలా జరుగుతున్నది తెలుసుకున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. ఆ తరువాత పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై జరుగుతున్న అభివృద్ది పనులపై చర్చించారు. అభివృద్ధి పనుల వేగం పెంచాలని చెప్పారు.

- Advertisement -

అధికారులతో సమన్వయం చేసుకోవాలి అని సూచించారు. అక్కడే ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను సందర్శించారు. యువతతో మాట్లాడారు. డ్రైవింగ్ మేళా కు స్పందన ఎలా ఉందంటూ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా మేళా జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. ఆయా చోట్ల వేర్వేరుగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, మ‌హిళ‌లు ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం స‌హా, దేశం బాగుప‌డుతుంద‌న్నారు. స‌హ‌జంగా మ‌హిళ‌ల్లో పొదుపు, మ‌దుపు, నిర్వ‌హ‌ణ అద్భుతంగా ఉంటాయ‌ని చెప్పారు. అందుకే సిఎం కెసిఆర్ మ‌హిళా సాధికార‌త మీద ప్ర‌త్యేక దృష్టి సారించార‌న్నారు. పేదరిక నిర్మూల‌న సంస్థ ద్వారా, స్త్రీ నిధి సంస్థ ద్వారా డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పావ‌లా వ‌డ్డీ, వ‌డ్డీలేని, బ్యాంకు లింకేజీ రుణాలు అంద‌చేస్తున్నామ‌న్నారు. మ‌హిళ‌ల రిక‌వ‌రీ బాగుండ‌టం వ‌ల్ల బ్యాంకులు కూడా ఎంత అడిగితే అంత మ‌హిళ‌ల‌కు ఇస్తున్నార‌న్నారు. అలాగే, రాష్ట్రంలోనే మొద‌టిసారిగా పైలెట్ ప్రాజెక్టుగా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన ఉచిత కుట్టు శిక్ష‌ణ‌, ఉచితంగా కుట్టు మిష‌న్‌ల పంపిణీ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. రూ.5 కోట్ల నిధుల‌తో 3 వేల మందికి ఈ శిక్ష‌ణ ఇస్తున్నామ‌ని, ఈ విడ‌త పూర్తి కాగానే, మిగ‌తా 7 వేల మందికి ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా శిక్ష‌ణ ఇస్తామ‌ని, మిష‌న్లు కూడా పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వారికి వ‌రంగ‌ల్ టెక్స్ టైల్ పార్క్ లో ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌న్నారు. క‌నీసం 10వేల మంది అవ‌స‌రం ఉంద‌ని, ఇప్ప‌టికిప్పుడు శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వాళ్ళ0ద‌రికీ దాదాపు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.


ఇక ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను యువత, అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ప్రమాదాలకు తావు లేని విధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనీ మంత్రి యువతకు ఉద్బోధించారు. డ్రైవింగ్ ఈ మేళా ద్వారా అందరూ లబ్ది పొందాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, జరుగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మ‌హిళ‌లు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు, యువత పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News