జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల గ్రామంలో రెండవ విడత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా కుట్టు శిక్షణ జరుగుతున్న తీరుని మంత్రి పరిశీలించారు. శిక్షణలో ఏవైనా సమస్యలున్నాయా? అంటూ ఆరా తీశారు. కుట్టు శిక్షణకు హాజరవుతున్న పట్టికను పరిశీలించారు. శిక్షణార్థులు అంతా వస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. శిక్షణ పొందుతున్న మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు. మొదటి విడత శిక్షణ దిగ్విజయంగా పూర్తైనందున రెండో విడత శిక్షణను కూడా అదే విధంగా పూర్తి చేయాలని, శిక్షణ పొందుతున్న వారంతా క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.